Samsung Layoffs: సామ్‌సంగ్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు బిగ్ షాక్!
Samsung Layoffs: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ ఇండియా తమ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. మెయింటెనెన్స్ ఖర్చులు విపరీతంగా పెరగడం, మార్కెట్లో డిమాండ్ తగ్గడం, లాభాల శాతంపై ఒత్తిడి పెరగడంతో సామ్సంగ్ సంస్థ తన సిబ్బందిని తగ్గించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సంస్థకు చెందిన టెలివిజన్, హోమ్ అప్లయన్సెస్ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 80 నుంచి 100 మంది ఎగ్జిక్యూటివ్ లను రాజీనామా చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఈ ఉద్యోగాల తొలగింపులను దశలవారీగా చేపడుతున్నారు.
ఈ ఉద్యోగాల కోత ప్రభావం కేవల దిగువ స్థాయి సిబ్బంది పైనే కాకుండా.. ప్రధాన కార్యాలయంలోని డైరెక్టర్ స్థాయి అధికారులు, టీమ్ లీడర్లు, అలాగే రీజినల్, బ్రాంచ్ మేనేజర్లపై కూడా పడింది. సామ్‌సంగ్‌లో స్మార్ట్ ఫోన్ రంగాన్ని మినహాయించి కేవలం సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలోనే 550 నుంచి 600 మంది అధికారులు పనిచేస్తున్నారు. ఈ విభాగంలో ఉన్న మొత్తం సిబ్బందిలో దాదాపు 25 శాతం మంది వరకు ఉద్వాసనకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాన్ని కోల్పోతున్న వారికి సామ్సంగ్ సంస్థ 3 నెలల జీతంతో పాటు వారు పనిచేసిన ప్రతీ ఏడాదికి మరో ఒక నెల జీతాన్ని పరిహారంగా ఇస్తోంది.

లేఆఫ్స్‌కు అసలు కారణం
సామ్సంగ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా కొన్ని ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. మెమరీ చిప్స్ ధరలు రెట్టింపు కావడం, రూపాయి విలువ క్షీణించడం, స్మార్ట్ ఫోన్ విక్రయాలు తగ్గిపోవడం వంటివి కంపెనీ మెయింటెనెన్స్ ఖర్చులను విపరీతంగా పెంచేశాయి. అంతే కాకుండా ఇండియాలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు గతంతో పోలిస్తే 11 నుంచి 12 శాతం వరకు తగ్గాయి. అయితే ఈ విడత లేఆఫ్స్‌లో స్మార్ట్ ఫోన్ విభాగానికి చెందిన ఉద్యోగులను తాకలేదు. రాబోయే దసరా, దీపావళి పండగల సీజన్లో విక్రయాలు పుంజుకుంటాయని కంపెనీ ఆశిస్తోంది. పండుగల తర్వాత ఈ సేల్స్ ఆధారంగా స్మార్ట్ ఫోన్ విభాగానికి సంబంధించిన మార్పులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి సామ్సంగ్ తన రీజినల్ ఆఫీసులను విలీనం చేస్తోంది. పాట్నా-రాంచీ అలాగే ఢిల్లీ-గురుగ్రామ్ ఆఫీసులను ఒక్కటిగా మారుస్తోంది. అయితే ఈ ఉద్యోగాల కోత వల్ల సామ్సంగ్ ఇండియాలోని తన వ్యాపారాన్ని తగ్గిస్తోందని భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గడిచిన ఆర్థిక ఏడాదిలో కంపెనీ ఆదాయం 12 శాతం పెరిగి రూ.1.1 లక్షల కోట్లకు చేరింది. కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికా వంటి ఇతర దేశాల్లో కూడా సామ్సంగ్ దాదాపు 700 మంది ఉద్యోగులను తొలగించి వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా పాత్రలను సర్దుబాటు చేసింది. పండగల సీజన్ సేల్స్ ఆధారంగా మున్ముందు ఈ లేఫ్స్ ఉంటాయా లేదా అనేది తేలనుంది.














Click it and Unblock the Notifications
