పవర్‌ఫుల్ విలన్‌గా దూసుకొస్తున్న కుర్ర హీరో! బాలయ్య ‘దాదా’తో సీన్ మారనుందా?
టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ మంచు మనోజ్ తన సినీ ప్రయాణంలో ఓ కొత్త మార్గాన్ని ఎంచుకుని, సినిమా ఇండస్ట్రీలో తనకంటూ సరికొత్త స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గతంలో హీరోగా ప్రయోగాత్మక సినిమాలు చేసిన మంచు మనోజ్.. ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్, విలన్ పాత్రల వైపు అడుగులు వేస్తున్నారు. మిరాయ్ సినిమాలో విలన్‌గా సరికొత్త మేకోవర్‌తో ప్రేక్షకులను మెప్పించిన మంచు మనోజ్.. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న 'దాదా' సినిమాలో అత్యంత కీలకమైన, పవర్‌ఫుల్ విలన్ రోల్ ను దక్కించుకున్నారు. ఈ సినిమా మంచు మనోజ్ యాక్టింగ్ కెరీర్‌కు ఊహించని మలుపు తిప్పే ఓ కీలక రోల్‌గా నిలవబోతోంది.
బాలయ్య చిత్రాల్లోని విలన్ పాత్రలు నటులకు ఎంతటి పెద్ద బ్రేక్ ఇస్తాయో ఇప్పటికే నిరూపించబడింది. దీనికి ఉదాహరణ 'లెజెండ్' సినిమాలో జగపతి బాబు పోషించిన 'జితేంద్ర' పాత్ర. అంతవరకు కుటుంబ కథానాయకుడిగా గుర్తింపు పొందిన జగపతిబాబును లెజెండ్ సినిమా ఒక్కసారిగా దక్షిణాది సినీ పరిశ్రమలోనే అత్యంత డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా మార్చేసింది. ఆ ఒక్క సినిమా ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ కు గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చి, ఇప్పటికీ తిరుగులేని నటుడిగా నిలబెట్టింది. ఇప్పుడు సరిగ్గా అలాంటి అరుదైన అవకాశమే 'దాదా' రూపంలో మంచు మనోజ్ ముందుకు వచ్చింది.

'మిరాయ్' సినిమా మంచు మనోజ్ చేసిన నెగటివ్ రోల్ ఆయన డార్క్, గ్రే-షేడ్ పాత్రలను సునాయాసంగా చేయగలరని స్పష్టం చేసింది. అయితే మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ సరసన 'దాదా' సినిమాలో నటించడం అనేది మంచు మనోజ్ కు చాలా పెద్ద వేదిక. ఒక హీరోతో కొన్ని సీన్లలో ఢీకొట్టే సాధారణ విలన్ పాత్రల కంటే ప్రేక్షకుల మనసులో బలమైన ముద్ర వేసే క్యారెక్టర్స్ మాత్రమే నటుడికి లాంగ్ రన్ ఇస్తాయి.
దర్శకుడు గోపిచంద్ మలినేని మాస్ సినిమాల్లో విలన్ పాత్రలను చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతారనే పేరుంది. 'దాదా' సినిమాలో మంచు మనోజ్ పాత్రకు క్రూరమైన స్వభావంతో పాటు స్టోరీని మలుపు తిప్పే పవర్ ఉందనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్ కు తగినట్లుగా మంచు మనోజ్ పాత్రను కూడా హోరాహోరీగా డిజైన్ చేసి ఉంటే.. ఈ సినిమా ఆయనను నిర్మాతలు, దర్శకులు చూసే కోణాన్నే మార్చేస్తుంది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడమే కాకుండా విలన్ గా తనను తాను రీ-ఇన్వెంట్ చేసుకోవడం ద్వారా మంచు మనోజ్ సరికొత్త కేటగిరీని సృష్టించుకోవచ్చు. ఒకవేళ డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా రాబోతున్న 'దాదా' సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి మంచు మనోజ్ నటనకు మెప్పు లభిస్తే.. అది ఆయనకు కేవలం మరొక సినిమా మాత్రమే కాదు.. అది దక్షిణాది సినీ పరిశ్రమలో ఓ ప్రధాన ప్రతినాయకుడిగా.. విలక్షణమైన నటుడిగా ఆయన ప్రస్థానానికి తిరుగులేని పునాది కానుంది.














Click it and Unblock the Notifications
