ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ధర మారలేదు, రేంజ్ మాత్రం పెరిగింది!
భారతీయ ద్విచక్ర వాహనం రంగంలో ప్రముఖ కంపెనీ అయిన టీవీఎస్ మోటార్స్ తన పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ లైనప్‌లో కీలక మార్పులు చేసింది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ తన పాత 2.2KWH వేరియంట్‌ను నిలిపివేసి దాని స్థానంలో మెరుగైన 2.3KWH బ్యాటరీ ప్యాక్‌తో కూడిన సరికొత్త బేస్ వేరియంట్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ కోరుకునే ప్రయాణీకులకు ఇది మంచి ఎంపికగా మారనుంది.
పెరిగిన రేంజ్
ఈ కొత్త వేరియంట్ స్పెషల్ అట్రాక్షన్ దీని మైలేజ్. గతంలో ఉన్న బేస్ మోడల్ ఒకే ఛార్జ్ పై 94 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగా.. ఈ కొత్త 2.3KWH బ్యాటరీ వేరియంట్ ఏకంగా 114 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. అంటే వినియోగదారులకు అదనంగా 20 కిలోమీటర్ల మైలేజ్ లభిస్తుంది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు చేసే వారికి ఈ అదనపు రేంజ్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

వేగం, పవర్ విషయంలో మార్పులు
ఎక్కువ రేంజ్ అందించే క్రమంలో టీవీఎస్ కంపెనీ మోటార్ పవర్, పర్ఫెర్మెన్స్ లో కొన్ని రాజీలు పడాల్సి వచ్చింది. ఇందులో పాత 4.4KW మోటార్ స్థానంలో 3.68KW మోటార్‌ను ఉపయోగించారు. దీని వల్ల స్కూటర్ టార్ స్పీడ్ గంటకు 75కిలోమీటర్ల నుంచి 68 కిలోమీటర్లకు తగ్గింది. అలాగే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేందుకు 4.2 సెకన్ల కంటే ఎక్కువ సమయం అంటే 4.7 సెకన్లు టైమ్ పడుతుంది. భద్రత పరంగా ముందు చక్రానికి డిస్క్ బ్రేక్ స్థానంలో డ్రమ్ బ్రేక్‌ను అందించారు.
ధర, ఛార్జింగ్ వివరాలు
ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచినప్పటికీ.. కంపెనీ ఈ స్కూటర్ ధరను పాత మోడల్ ధరకు సమానంగానే ఉంచడం విశేషం. బెంగళూరులో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.16 లక్షలుగా (పీఎం ఇ-డ్రైవ్ సబ్సిడీ మినహాయించి) ఉంది. ఇది 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవ్వడానికి సుమారు 2 గంటల 50 నిమిషాలు పడుతుంది, ఇది మునుపటి మోడల్ కంటే కొంచెం ఎక్కువ సమయం. మొత్తం మీద గరిష్ట వేగం కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, సరసమైన ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కోరుకునే వినియోగదారులను టీవీఎస్ లక్ష్యంగా చేసుకుంది.












Click it and Unblock the Notifications