చీరలోనే జిమ్ వర్కౌట్స్: యువతకు స్ఫూర్తిగా 56 ఏళ్ల మహిళ (వీడియో)
చెన్నై: ఓ 56 మహిళ నాలుగేళ్ల క్రితం వరకు మోకాలు, కాలు నొప్పితో తీవ్రంగా బాధపడుతుండేది. పలు ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే, తన తల్లి బాధను చూడలేక ఆమె కుమారుడు పలు పరిశోధనలు చేశాడు. వ్యాయామం ద్వారానే తన తల్లి నొప్పి నుంచి బయటపడుతుందని తెలుసుకున్నాడు. ఇక ఆలస్యం చేయకుండా తన సొంత జిమ్‌లోనే కసరత్తులు చేయించాడు. ఆమె కూడా తన కోడలుతో కలిసి చురుగ్గా వర్కౌట్స్ చేసింది. దీంతో ఆమె నొప్పి బాధలు ఎగిరిపోవడమే గాక, శరీరక, మానసికంగా కూడా దృఢంగా తయారైంది ఈ 56 ఏళ్ల మహిళ. చీరలోనే కసరత్తులు చేస్తున్న ఈ మహిళ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనేకమంది ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
వయస్సు అనేది ఒక నెంబర్ మాత్రమే..
ఈ స్ఫూర్తిగాథ వివరాల్లోకి వెళితే.. హుమన్స్ ఆఫ్ మద్రాస్ అండ్ మద్రాస్ బర్బెల్ ఆమెకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 56 ఏళ్ల మహిళ చీర కట్టులోనే పవర్ లిఫ్టింగ్ చేయడంతోపాటు పుషప్స్ కూడా చేస్తోంది. వయస్సు అనేది ఒక నెంబర్ మాత్రమే. ఆమె తన కోడలుతో కలిసి ప్రతిరోజూ జిమ్‌లో వ్యాయామం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారంటూ ఆ వీడియో పోస్టులో వ్యాఖ్యానించారు.
56 ఏళ్ల మహిళ చీరలోనే జిమ్ వర్కౌట్స్
56 ఏళ్ల మహిళకు సంబంధించిన ఆ వీడియోలో ఆమె చెప్పినట్లుగా పలు వ్యాఖ్యలున్నాయి. 'నా కోడలితో కలిసి నేను రోజూ వర్కౌట్స్ చేస్తున్నాను' ఆమె పేర్కొంది. ఈ వీడియోలో కోడలితో కలిసి ఆమె వ్యాయామం చేస్తున్న దృశ్యాలున్నాయి. డెడ్ లిఫ్ట్, కెటిల్ బెల్ రో, బెంచ్ ప్రెస్, బర్బెల్ స్క్వాట్ తోపాటు అన్ని కసరత్తులను కూడా ఆమె చీరలోనే చేస్తుండటం గమనార్హం.
56 ఏళ్ల వయస్సులోనూ ఇంత ఉత్సాహంగా కసరత్తులు చేసిన ఆమెకు జిమ్ సభ్యులు సన్మానం చేయడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు.
మోకాలు, కాళ్ల నొప్పులకు జిమ్ వర్కౌట్స్‌తో చెక్ అంటూ మహిళ
52 ఏళ్ల వయస్సున్నప్పుడు తాను మోకాలు, కాళ్ల నొప్పులతో తీవ్రంగా బాధపడినట్లు ఆ మహిళ తెలిపింది. తన కుమారుడి సూచనలతో తాను 52 ఏళ్ల వయస్సులో జిమ్ లో కసరత్తులు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతిరోజూ ఇలా జిమ్ లో వ్యాయామం చేయడం వల్ల తాను తన నొప్పి బాధల నుంచి విముక్తి పొందినట్లు వెల్లడించారు. అంతేగాక, తాను ఇప్పుడు శరీరకంగా కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఈ జిమ్ వర్కౌట్స్ కు సంబంధించిన వీడియో కేవలం ఏడు రోజుల్లోనే 1.3 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించడం గమనార్హం. ఆ మహిళను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆమె ఎంతో మంది మహిళలకే కాకుండా యువతకు కూడా స్ఫూర్తిగా నిలిచారంటూ కొనియాడుతున్నారు.












Click it and Unblock the Notifications