షాకింగ్ : మహిళా సీఐకి కరోనా పాజిటివ్.. ఆందోళనలో పోలీస్ కుటుంబాలు..
కరోనా పాజిటివ్ కేసుల్లో ముందు వరుసలో ఉన్న చిత్తూరు జిల్లాలో మరో కలకలం రేగింది. తమిళనాడు-చిత్తూరు సరిహద్దు ప్రాంతంలో తాజాగా ఓ పాజిటివ్ కేసు నమోదైంది. కుప్పం పట్టణానికి సుమారు 30కి.మీ దూరంలో ఉన్న వానియంబడిలో తాలూకా పోలీస్ స్టేషన్‌లో మహిళా సీఐకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు ఆ పోలీస్ స్టేషన్‌ను మూసివేయించి.. సీఐని వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
ఆ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న 43 మంది సిబ్బందితో పాటు పలువురు విలేకరులకు కూడా అధికారులు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ పోలీస్ సిబ్బంది కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కరోనా సోకిన సీఐ భర్త తమిళనాడులో డీఎస్పీగా పనిచేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన్ను క్వారెంటైన్‌కు తరలించినట్టు తెలుస్తోంది. అటు కుప్పం ప్రజలు సైతం ఈ వార్త తెలిసి భయాందోళనకు గురవుతున్నారు.

కాగా,ఏపీలో ఇప్పటివరకు 1097 కేసులు నమోదవగా.. చిత్తూరులో 73 కేసులు నమోదయ్యాయి. వీరిలో 13 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 60 మంది కరోనా యాక్టివ్ పేషెంట్లు ఉన్నారు. ఇక రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 279 కేసులు నమోదయ్యాయి. గుంటూరు 214, కృష్ణా 177,నెల్లూరు 72,కడప 58,ప్రకాశం 56,అనంతపురం 53,పశ్చిమ గోదావరి 51 ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. విజయనగరం జిల్లా కరోనా ఫ్రీగా కొనసాగుతోంది.