టీడీపీ- బీజేపీ వాదులాట: పురంధేశ్వరి కళ్ల ముందే..
TDP Janasena BJP alliance: రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ.. జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ఇంకా కుదుట పడట్లేదు. పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ కూటమిలో చిచ్చు మరింత చెలరేగుతోందే తప్ప ఆరట్లేదు.
ఈ కూటమి వ్యవహారం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవాల్సి వస్తోంది. టీడీపీ, జనసేనకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, ఆశావహులు, మాజీ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారు.

శివరామరాజు, కే అప్పల్నాయుడు, జేడీ రాజశేఖర్, పోతిన మహేష్, పితాని బాలకృష్ణ, అత్తర్ చాంద్ భాషా, రెడ్డెప్పగారి రమేష్ రెడ్డి.. వంటి నాయకులు తిరుగుబాటు బాట పట్టారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నారు. మరికొందరు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ మూడు పార్టీల మధ్య సమన్వయం సాధ్యపడట్లేదు.
కూటమిలో ఇంకా లుకలుకలు కొనసాగుతున్నాయనడానికి తాజా ఉదాహరణ.. తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. తెలుగుదేశం- బీజేపీ- జనసేన పార్టీ నాయకులు పాల్గొన్న రాజానగరం సమీక్ష సమావేశం రసాభాస అయింది. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. ఒకదశలో ఒకరినొకరు తోసుకున్నారు.
ఈ సమావేశానికి సాక్షాత్తూ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సారథ్యాన్ని వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో పురంధేశ్వరి రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ లోక్‌సభ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాల్లో రాజానగరం కూడా ఒకటి.

తాను పోటీ చేస్తోన్న లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలను ఆమె నిర్వహిస్తోన్నారు. ఇందులో భాగంగా రాజానగరం వెళ్లారు. ఆమె ఎదురుగానే కూటమి నాయకులు గొడవ పడ్డారు. వాదులాటకు దిగారు. ఒకరినొకరు తోసుకున్నారు. పురంధేశ్వరి ఫొటోను ముద్రించివున్న ఫ్లెక్సీని సైతం చించి పక్కనపడేశారు.
ఆ సమయంలో పురంధేశ్వరి వేదికపైనే ఉన్నారు. ఆమె కళ్లముందే ఇదంతా జరిగింది. వారిని వారించే ప్రయత్నం చేశారు గానీ అది సాధ్యపడలేదు. దీనితో చేతులు కట్టుకుని నవ్వుతూ గొడవ పడుతున్న వారిని చూస్తూ కూర్చుండిపోయారు పురంధేశ్వరి. టీడీపీ- బీజేపీ- జనసేన మధ్య పొత్తు క్షేత్రస్థాయిలో ఏ మాత్రం సత్ఫలితాలను ఇవ్వట్లేదనే విషయాన్ని ఈ ఉదంతం రుజువు చేసినట్టయింది.












Click it and Unblock the Notifications