శక్తిమంతమైన స్కంద షష్టి- ఇలా చేయండి
ఫాల్గుణ శుక్ల షష్ఠి నాడు స్కంద షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు. సుబ్రహ్మణ్యుడికి అంకితం చేసిన తిథి.. స్కంద షష్ఠి. ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగంతో పాటు పలు శుభ యోగాలు, నక్షత్రాలు కలవనున్నాయి. స్కంద షష్ఠి వ్రతం ఆచరించడం వల్ల భక్తులకు అన్ని రకాల రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. కార్తికేయుడి అనుగ్రహాన్ని పొందుతారు. సంతాన భాగ్యం కలుగుతుంది. ఐశ్వర్యం చేకూరుతుందని విశ్వసిస్తారు. జీవితంలోని సమస్త కష్టాలకు ఈ వ్రతం ముగింపు పలుకుతుందని భావిస్తారు.
పంచాంగం ప్రకారం ఈ ఉదయం 11:09 నిమిలకు ఫాల్గుణ శుక్ల షష్ఠి తిథి ప్రారంభమౌతుంది. సోమవారం ఉదయం 9:09 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయాతిథి ప్రకారం స్కంద షష్ఠి వ్రతాన్ని నేడే ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజున నాలుగు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం తెల్లవారు జామున 6:53 నుండి సాయంత్రం 5:54 వరకు ఉంటుంది. రవి యోగం సాయంత్రం 5:54 గంటలకు ప్రారంభమై, సోమవారం ఉదయం 6:52 నిమిషాల వరకు కొనసాగుతుంది.

శుక్ల యోగం తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం 1:09 వరకు, బ్రహ్మ యోగం మరుసటి ఉదయం వరకు ఉంటుంది. అలాగే అశ్విని నక్షత్రం సాయంత్రం 5:54 వరకు ఉండి, ఆ తర్వాత భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ శుభ యోగాలలో పూజలు చేయడం మరింత ప్రయోజనకరంగా భావిస్తారు. స్కంద షష్ఠి వ్రత పూజకు ఉదయం, మధ్యాహ్నం వేళలు అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు. అమృత/సర్వోత్తమ ముహూర్తం ఉదయం 11:09 నుండి మధ్యాహ్నం 12:35 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:12 నుండి 12:57, నిశిత ముహూర్తం అర్థరాత్రి 12:09 నుండి 12:59 వరకు ఉంటుంది.
వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి, స్నానం చేయాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసి, గంగాజలంతో సంప్రోక్షించాలి. పూజకు సమర్పించే నైవేద్యాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఒక పీఠంపై కార్తికేయ స్వామి ప్రతిమను ప్రతిష్టించాలి. అనంతరం స్వామివారిని గంగాజలంతో అభిషేకించి, చందన తిలకం దిద్దాలి. పసుపు రంగు పూలమాలలు సమర్పించి, నెయ్యి దీపాలను వెలిగించాలి. పండ్లు, ఇంట్లో తయారుచేసిన నైవేద్యాలను స్వామివారికి సమర్పించాలి.
కార్తికేయుడిని శక్తివంతమైన మంత్రాలను జపించి, వ్రత కథను చదవడం లేదా వినడం చేయాలి. చివరగా, సుబ్రహ్మణ్య స్వామికి హారతి ఇచ్చి వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ వ్రతం ఆచరించేటప్పుడు తామస ఆహారం, పనులు పూర్తిగా వర్జించాలి. మరుసటి రోజున తిరిగి పూజ చేసి, నిరుపేదలకు దానధర్మాలు చేసి వ్రత పారణ చేయాలి.












Click it and Unblock the Notifications