శ్రీరామనవమి వ్రతం.. ఆచరిస్తే సకల జన్మల పాపహరణం; వ్రత విధానమిదే!!
శ్రీరామనవమి.. చైత్రమాసం శుక్లపక్ష నవమి నాడు శ్రీరామచంద్రుడు అవతరించాడు. ఈ సంవత్సరం నేడు శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. అయోధ్య రాముడు, దశరథ తనయుడు, సకల కళా గుణభిరాముడు అయిన శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్ర యుక్తమైన కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడి రూపం లోకానికి ఎన్నో విలువలను నేర్పింది. ఒక మాట ఒక బాట అన్నట్టుగా సాగిన రాముని జీవితం ఎంతో ఆదర్శప్రాయమైనది.
శ్రీరాముడు జన్మించడమే కాదు శ్రీరామ కళ్యాణం కూడా నేడు జరగడం విశేషం. లోక కల్యాణం కోసం శ్రీరామ కల్యాణాన్ని వాడవాడలా ఘనంగా జరుపుతారు. ఇక శ్రీరామ నవమి వ్రతాన్ని ఆచరించాలి అనుకునేవారు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోవాలని చెబుతున్నారు. శ్రీరామనవమి రోజున ఉదయాన్నే తల స్నానం చేసి ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్యం మూలలో అందమైన మండపాన్ని ఏర్పాటు చేసి శ్రీరాముడి పట్టాభిషేక చిత్రాన్ని కానీ, సీతారామ, లక్ష్మణ, హనుమాన్లు ఉన్నటువంటి చిత్రాన్ని కానీ మండపంలో పెట్టి నిష్టగా పూజించాలి.

పూలు, పసుపు, కుంకుమ, అక్షింతలు, గంగాజలంతో రామయ్య కు పూజలు చేసి నెయ్యి దీపాన్ని వెలిగించి కర్పూర హారతి ఇవ్వాలి. శ్రీరామచంద్రమూర్తికి ఎర్రటి పువ్వులు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి ఎర్రటి పూలతో స్వామివారిని పూజించాలి. శ్రీరాముని పూజించే ముందు హనుమంతుడికి పూజ చేయాలి. ఇక రాముడికి అత్యంత ఇష్టమైన సీతాఫలాన్ని నైవేద్యంగా పెట్టాలి. అంతేకాదు శ్రీరాముడి కోసం తయారు చేసిన నైవేద్యం, పానకం, వడపప్పు స్వామికి నిష్టగా సమర్పించి పూజించాలి.
ఇక శ్రీరామ నవమి వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాస దీక్షను ఆచరిస్తే మంచిది. పాలు, పండ్లను ఆహారంగా తీసుకొని రోజంతా శ్రీరామచంద్రుడి మూలమంత్రాన్ని పఠిస్తూ అత్యంత నిష్టగా ఉపవాస దీక్షను ఆచరించాలి. శ్రీరామనవమి వ్రతాన్ని ఆచరిస్తున్న వారు నేడు అన్నదానం చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఇక వృద్ధులు, ఉపవాసం చేయలేనివారు శ్రీరామనవమి పండుగ నాడు ఒకటే పూట భోజనం చేసి కూడా శ్రీరామనవమి వ్రతాన్ని కొనసాగించవచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చేయవలసింది శ్రీరామచంద్రునిపై మనసు లగ్నం చేసి పూజించడం. ఇక శ్రీరామనవమి పండుగ రోజు నిష్టగా పూజించి, ఉపవాస దీక్షను ఆచరించిన వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, వారికి ముక్తి లభిస్తుందని భక్తులు విశేషంగా నమ్ముతారు.












Click it and Unblock the Notifications