వెండి వస్తువులు కొత్తవాటిలా మెరవాలంటే శుభ్రం చేసేటప్పుడు ఈ చిట్కాలు ట్రై చెయ్యండి!!
చాలామంది ఇంట్లో వెండి వస్తువులను ఎంతో ఇష్టంగా కొనుక్కుంటారు. వెండికి తొలినాళ్లలో ఉండే మెరుపు క్రమంగా తగ్గిపోతుంది. వెండి గ్లాసులు, చెంబులు, ప్లేట్లు ఇలా వెండి సామాన్లను, వెండి జ్యువలరీని శుభ్రం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి బాగా మెరుపు రాలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇక అలాంటి వారి కోసమే ఎక్కువ కష్టం లేకుండా సింపుల్ గా ఉండే ఈ టిప్స్ మీకందిస్తున్నాం.
వెండి వస్తువులను శుభ్రం చేయడానికి మనం సమోసాలు, శాండ్విచ్, బర్గర్ల లో తినే కెచప్ ను ఉపయోగించవచ్చు. కెచప్ తో వెండి సామాన్లు శుభ్రం చేస్తే తళతళా మెరుస్తాయి. కావలసిన మేరకు కెచప్ తీసుకొని మెత్తని కుచ్చులున్న టూత్ బ్రష్ తో వెండి సామాన్లను రుద్ది ఆపై 15నిముషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మెత్తని వస్త్రంతో తుడుచుకుంటే వెండి సామాన్లు తళతళ మెరుస్తాయి.

కెచప్ లో ఉండే ఆమ్లతత్వం వల్ల వెండి వస్తువులు తెల్లగా మారతాయి. అంతేకాదు వెనిగర్ తో కూడా వెండి సామాన్లు శుభ్రం చేసుకోవచ్చు. దీనికి చేయవలసిందల్లా సగం కప్పు వెనిగర్ లో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసి, గోరువెచ్చని నీళ్ళు కలిపి దానిలో వెండి వస్తువులను పూర్తిగా మునిగేలా పెట్టాలి. రెండు గంటల తరువాత వాటిని కొద్దిగా రుద్దుతూ చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేస్తే ఎక్కువ కష్టం లేకుండానే వెండి సామాన్లు తళుక్కుమన్నాయి. అంతేకాదు శనగపిండిలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని వెండి సామాన్లకు రుద్ది ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడిగితే వెండి సామాన్లు తెల్లగా మెరిసిపోతాయి. టూత్ పేస్ట్ తో శుభ్రం చేసినా కూడా వెండి సామాన్లు మెరుస్తాయి.
బంగాళదుంపలను మరిగించిన నీళ్లలో వెండి వస్తువులను శుభ్రం చేస్తే కూడా అవి బాగా శుభ్రం అవుతాయి. బంగాళదుంపలు ఉడకబెట్టిన నీళ్లల్లో వెండి సామాన్లు శుభ్రం చేయాలంటే ఓ గంట పాటు ఆ నీళ్లలోనే వెండి వస్తువులను వదిలేసి ఆపై బ్రష్ తో తోముతూ శుభ్రం చేసుకోవాలి.
అయితే ఎప్పుడైనా వెండి వస్తువులను బాగా ఎక్కువ వేడి ఉన్న నీళ్ళలో వేయడం మంచిది కాదు . అలా చేస్తే సహజంగా వాటికి ఉన్న మెరుపును అవి కోల్పోతాయి. కాబట్టి వెండి వస్తువులను శుభ్రం చేసేటప్పుడు సింపుల్ గా, మెరుపును సంతరించుకునే ఈ టిప్స్ ను ట్రై చేయండి.












Click it and Unblock the Notifications