చంద్రబాబు సభల్లో మరణమృందంగం- ఇప్పటికి 11 మంది మృతి: ఇదేం ఖర్మ రాష్ట్రానికి- అంబటి ఫైర్
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా పర్యటనలో గందరగోళం చోటు చేసుకుంది. గుంటూరు వికాస్ నగర్ లో ఆయన నిర్వహించిన సభలో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మహిళలు దుర్మరణం పాలయ్యారు. సంఘటన స్థలంలో ఓ మహిళ మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పలువురు గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
మొన్నటికి మొన్న నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో తొక్కిసలాట చోటు చేసుకుని ఎనిమిదిమంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా గుంటూరు వికాస్ నగర్ లో నిర్వహించిన సభ, చంద్రన్న కానుకల పంపిణీ సభలోనూ అలాంటి పరిస్థితే ఏర్పడింది. ఈ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

సంక్రాంతి పండగ సమీపిస్తోన్న నేపథ్యంలో చంద్రన్న కానుకల పేరుతో చీరలను పంపిణీ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. చంద్రన్న కానుకల పంపిణీ చేస్తోన్న సమయంలో- దీనికోసం వచ్చిన వారంతా ఒక్కసారిగా ముందుకు తోసుకుని వచ్చారు. దీనితో తొక్కిసలాట సంభవించింది. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.
ఇదివరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు..సంక్రాంతి పండగ సమయంలో చంద్రన్న కానుక పేరుతో ఓ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. దాన్నే ఇప్పుడు అనధికారికంగా ఏర్పాటు చేశారు. చంద్రన్న సంక్రాంతి కానుకగా దుస్తులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. కందుకూరు రోడ్ షోలో ఎనిమిది మంది మరణించిన ఉదంతం ఇంకా స్మృతిపథం నుంచి తొలగిపోకముందే మళ్లీ అలాంటి ఘటన పునరావృతం కావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది.
తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన పట్ల జిల్లాకు చెందిన జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబుపై భగ్గుమన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాల్లో 29 మంది మరణించడానికి చంద్రబాబే కారణమని గుర్తు చేశారు. ఇప్పుడు కందుకూరులో ఎనిమిది మంది చంద్రబాబు వల్లే దుర్మరణం పాలయ్యారని ధ్వజమెత్తారు. ఇప్పుడు కూడా గుంటూరు చంద్రన్న కానుకల పంపిణీ సభలో ఇప్పటికి మరో ముగ్గురిని పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications