వైసీపీ నాలుగో సిద్ధం సభ ఎక్కడ?
Andhra Assembly elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పర్యటనలను నిర్వహిస్తోన్నారు. జనంలోకి దూసుకెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతున్నారు.
ఇప్పటికే మూడు విడతల్లో సిద్ధం బహిరంగ సభలు ముగిశాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వాటిని నిర్వహించింది వైఎస్ఆర్సీపీ. విశాఖపట్నం జిల్లా భీమిలి, ఏలూరు జిల్లా దెందులూరు, అనంతపురం జిల్లా రాప్తాడుల్లో లక్షలాది మంది జనం మధ్య ప్రసంగించారు వైఎస్ జగన్.

ఒకదాన్ని మించి మరొకటి.. అన్న విధంగా సాగాయి ఈ సభలన్నీ కూడా. రాప్తాడులో ఏర్పాటు చేసిన సభ.. రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి ఉన్న పట్టుకు అద్దం పట్టింది. 10 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. నాలుగు ఉమ్మడి రాయలసీమ జిల్లాల నుంచీ జనాన్ని తరలించడంలో పార్టీ నాయకులు విజయం సాధించారు.
280 ఎకరాల్లో ఈ సభను నిర్వహించినప్పటికీ.. స్థలం సరిపోలేదనే అంచనాలు ఉన్నాయి. సభా ప్రాంగణంలోనికి వెళ్లలేక రోడ్ల బయటే నిల్చుని వైఎస్ జగన్ ప్రసంగాన్ని అసాంతం విన్నారు. ఇతర రాయలసీమ జిల్లాలతో పోల్చుకుంటే టీడీపీకి గట్టి బలం ఉన్న అనంతపురంలోనే బహిరంగ సభ సక్సెస్ కావడం పార్టీ నాయకుల్లో జోష్ నింపింది.
ఈ మూడింటి తరువాత నాలుగో విడత సిద్ధం బహిరంగ సభ నిర్వహణపై దృష్టి సారించింది వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం. ఈ సారి పల్నాడులో ఈ సభను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఒంగోలు, నెల్లూరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. పల్నాడు వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ఈ సభ ఎప్పుడు నిర్వహించాలనేది ఇంకా నిర్ణయించ లేదు. ఈ నెల చివరివారంలో ఉండొచ్చని సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయానికి అయిదు బహిరంగ సభలను పూర్తి చేయాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోన్నందున.. జాప్యం జరగకపోవచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications