పవన్ కల్యాణ్ నోట మళ్లీ కులం మాట: కీలక ప్రకటన..
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఘాటు విమర్శలు చేశారు. రైతులు ఎదుర్కొంటోన్న కష్టాలకు ప్రభుత్వమే కారణమంటూ మండిపడ్డారు. సుమారు మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడినప్పటికీ- ప్రభుత్వంలో చలనం లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రైతులకు సహాయం చేసే విషయంలో కూడా ప్రభుత్వం కులాన్ని చూస్తోందంటూ ఆరోపించారు.
రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ సాయంత్రం హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇందులో పాల్గొన్నారు. ఏపీలో కౌలు రైతుల స్థితిగతులపై తాము రూపొందించిన నివేదికను రైతు స్వరాజ్య వేదిక సభ్యులు పవన్ కల్యాణ్ కు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు ఎదుర్కొంటోన్న కష్టాలు మనసు ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయని, ఏపీ ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదని చెప్పారు.

కౌలు రైతుల కడగండ్లకు ఏపీ ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. పంట ఉత్పత్తిలో 80 శాతం కౌలు రైతులే సాగు చేస్తోన్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రస్తుతం కౌలు రైతులు నష్టాల పాలయ్యారని, అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారని చెప్పారు. వరి, మిర్చి, పత్తిలాంటి పంటలు వేసిన రైతులు కూడా నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా యాత్రల పేరుతో తాము నిర్వహించిన కార్యక్రమాల్లో కౌలు రైతుల కుటుంబాల కష్టాలను తాను స్వయంగా తెలుసుకున్నానని అన్నారు.
కౌలు రైతులు ఎదుర్కొంటోన్న కష్టాలపై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పటివరకు తాము ఎనిమిది జిల్లాల్లో 700 మందికి పైగా కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని చేశామని గుర్తు చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా రైతుల పక్షపాతిగా ఉంటోందని గుర్తు చేశారు. రైతు సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications