మాధవ్ కు హిందూపూర్ బాధ్యత, జగన్ కీలక నిర్ణయం: అనంత వైసిపి వ్యూహం ఫలించేనా..!
టిడిపి కి కంచుకోట గా ఉన్న హిందూపూర నియోజకవర్గం పై వైసిపి అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపి జెసి దివాకర్ రెడ్డి పై సవాల్ విసిరి సంచలనం గా మారిన మాజీ పోలీసు అధికారి కొద్ది రోజుల క్రితం వైసిపి లో చేరారు. ఆయన కు అనంత జిల్లాలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. జగన్ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు అనంత వైసిపి లో కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి.

హిందూపూర్ బాధ్యతలు అప్పగింత..
అనంతపురం జిల్లాలో హిందూపూర్ లోక్‌సభ..అసెంబ్లీ టిడిపికి కంచుకోటగా ఉన్నాయి. టిడిపి ఆవిర్భావం తరువాత హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి మినహా మరే పార్టీ ఇప్పటి వరకు గెలవలేదు. రాయలసీమ లో ప్రత్యే కంగా అనంతపురం జిల్లాలో టిడిపికి చెక్ పెట్టటం ద్వారా పూర్తి పట్టు సాధించాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. అందు లో భాగంగా పాదయాత్ర సమయంలో అనంతపురం-కర్నూలు జిల్లాలో ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం బిసిలకు కేటాయి స్తానని జగన్ ప్రకటించారు. అందులో భాగంగానే..ఇప్పటికే అనంతపురం సమన్వయకర్తగా బోయ రంగయ్య ఉన్నారు. ఇక, ఇప్పుడు తాజాగా హిందూపూర్ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తగా కొద్ది రోజుల క్రితం వైసిపి లో చేరిన మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ కు అప్పగిస్తూ జగన్ నిర్ణయించారు.

అనంత లో బిసిలకు ప్రాధాన్యత..
అనంతపురం జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శ కొంత కాలంగా ఉంది. ఇటువంటి విమర్శలకు అవకాశం లేకుండా జిల్లాలో అధికంగా ఉండే బిసి వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ నియామకాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాయదుర్గం, పెనుకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు బీసీ నేతలను సమన్వయ కర్తలుగా నియమించారు. హిందూపూర పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, పెనుకొండ సమన్వయ కర్తగా బిసి వర్గానికి చెందిన శంకరనారాయణ కు అవకాశం ఇచ్చారు. అదే విధగంగా పెనుకొండ, రాయదుర్గం లకు సైతం బిసి వర్గాలకే అవకాశం ఇవ్వటం ద్వారా జిల్లాలోని బిసి వర్గాల్లో రెండు ప్రధాన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా వైసిపి నేతలు చెబుతున్నారు. అదే విధంగా..ఇప్పుడు బిసి వర్గానికే చెందిన గోరంట్ల మాధవ్ కు హిందూపూర్ పార్లమెంటరీ నియోజక వర్గ బాధ్యతలు అప్పగించారు.

మాధవ్ ప్రభావం చూపేనా..
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు జగన్ తీసుకున్న తాజా నిర్ణయం చర్చకు కారణమవుతోంది. కీలక మైన హిందూపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి సామాజిక సమీకరణాల్లో భాగంగా గోరంట్ల మాధవ్ కు సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. బిసి కురుబ వర్గానికి చెందిన మాదవ్ పై బిసిలలో క్రేజ్ ఉంది. అయితే, రాజకీయంగా కొత్త గా వచ్చిన మాధవ్ కీలకమైన ఈ నియోజకవర్గం లో ఎంత వరకు పట్టు సాధిస్తారనేది ఇప్పుడు అసలు చర్చ. అయితే, ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి కావటం..జిల్లాలో జెసి దివాకర్ రెడ్డికి సవాల్ విసిరిన వ్యక్తిగా మాధవ్ కు గుర్తింపు ఉందని వైసిపి నేతలు చెబుతున్నారు. పోలీసు అధికారిగా మీసం తిప్పిన మాధవ్ ఇప్పుడు తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణ లో ఫలితాల సాధనలో ఎంత వరకు మీసం తిప్పుతారో చూడాలి.












Click it and Unblock the Notifications