ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు- ఎమ్మెల్యేల కోటాలో: ఇద్దరికి కేబినెట్ బెర్త్ కన్‌ఫర్మ్
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శాసన మండలి ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తోన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అయిదు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. మరో నాలుగింటికి ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.

ఏపీలో..
ఎమ్మెల్యేల కోటాలో విజయనగరం- వీవీ సూర్యనారాయణ రాజు, బాపట్ల- పోతుల సునీత, విశాఖపట్నం- కోలా గురువులు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ- బొమ్మి ఇజ్రాయెల్, ఏలూరు- జయమంగళ వెంకటరమణ, గుంటూరు-చంద్రగిరి ఏసురత్నం, పల్నాడు- మర్రి రాజశేఖర్ ఎన్నిక కావాల్సి ఉంది. గవర్నర్ కోటాలో అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కుంభా రవిబాబు, కాకినాడ నుంచి కర్రి పద్మశ్రీ నామినేట్ కావాల్సి ఉంది.

బీఆర్ఎస్ అభ్యర్థులు..
ఇక తాజాగా తెలంగాణలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రముఖ రచయిత, గాయకుడు దేశపతి శ్రీనివాస్, ప్రముఖ పారిశ్రామికవేత్త కూర్మయ్యగారి నవీన్ కుమార్, మాజీ శాసన సభ్యుడు చల్లా వెంకట్రామిరెడ్డిని శాసన మండలి ఎన్నికల బరిలో దింపింది. ఎమ్మెల్యే కోటాలో ఈ ముగ్గురూ పోటీ చేయనున్నారు.

ఓఎస్డీగా..
సిద్ధిపేట్ కు చెందిన దేశపతి శ్రీనివాస్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. రచయిత, గాయకుడు కూడా. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పని చేశారు. తన రచనలు, గేయాలతో ఉద్యమాన్ని మరింత ప్రభావితం చేయగలిగారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఆయన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా వ్యవహరిస్తోన్నారు.

మాజీ ఎమ్మెల్యేగా..
చల్లా వెంకట్రామిరెడ్డి.. మాజీ ఎమ్మెల్యే. 2004లో అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తరువాత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడాయన సేవలను బీఆర్ఎస్ వినియోగించుకోనుంది. ఆయనను శాసనమండలికి నామినేట్ చేసింది.

ఇద్దరికి కేబినెట్ బెర్త్..
ఎమ్మెల్యేల కోటా కింద జరిగే ఎన్నికలు కావడం వల్ల ఈ ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు లాంఛనప్రాయమే. వారి గెలుపునకు అవసరమైన సంఖ్యాబలం బీఆర్ఎస్ కు ఉంది. అటు కాంగ్రెస్ గానీ, ఇటు భారతీయ జనతా పార్టీ గానీ తమ అభ్యర్థులను నిలబెట్టకపోవచ్చని చెబుతున్నారు. ఫలితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ముగ్గురిలో ఇద్దరికి కేసీఆర్- తన కేబినెట్ లో బెర్త్ కల్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.












Click it and Unblock the Notifications