కేసీఆర్ కావాలి.. కేసీఆర్ రావాలి: గంపగోవర్ధన్ కుమారుడి పెళ్లి వేడుకలో హోరెత్తించారు
హైదరాబాద్: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ తోపాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో పలు గ్రామాలు ఇప్పటికే కేసీఆర్‌ను గెలిపించాలని ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. సీఎం కేసీఆర్ వస్తే కామారెడ్డి అభివృద్ధి చెందుతుందని ఆ నియోజకవర్గం ప్రజలు ఆశిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి వివాహానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలో కామారెడ్డి నియోజకవర్గానికి రావాలని కోరుతూ.. పెళ్లికి హాజరైన ప్రజలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున కేసీఆర్ ముందు నినాదాలు చేశారు.

వివాహానికి హాజరైన కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు సీఎం కేసీఆర్‌ను స్వాగతిస్తూ.. మద్దతు పలుకుతూ.. ఫంక్షన్ హాల్ ప్రధాన ద్వారం నుంచి పెండ్లి మండపం వరకు, 'కేసీఆర్ జిందాబాద్, జై కేసీఆర్', 'సీఎం కేసీఆర్ రావాలి' 'స్వాగతం కామారెడ్డికి స్వాగతం' 'కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి' 'జై కేసీఆర్.. దేశ్‌కీ నేత కేసీఆర్' వంటి నినాదాలతో ఆ పెండ్లి ప్రాంగణం దద్దరిల్లింది. కామారెడ్డి ప్రజలు ముఖ్యంగా యవత హాల్‌లో దారికి ఇరువైపులా నిలబడి నినాదాలతో హోరెత్తించారు.
తమ సెల్ ఫోన్‌లతో కేసీఆర్‌ను ఫొటో తీసుకొనేందుకు, సీఎంతో కరచాలనానికి మహిళలు, యువతీ యువకులు పోటీపడ్డారు. సార్.. సార్ అంటూ తమ అభిమానాన్ని చటడానికి ప్రయత్నించారు. వారి ఉత్సాహం, ఆసక్తిని గమనించిన కేసీఆర్ అభివాదం, కరచాలనం చేస్తూ, ఫొటోలకు అవకాశమిస్తూ ముందుకు సాగారు. మహిళలతో ఫొటోలు దిగారు.

పెళ్లి వేడుకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, జాజాల సురేందర్, ఎంపీ బీబీ పాటిల్ తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications