వర్షాలు వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఇవాళ ఉదయం కాస్త విరామం ఇచ్చినా.. తర్వాత మాత్రం పడుతూనే ఉన్నాయి. దీంతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్షించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గోదావరి, ఉప నదుల్లో వరద పరిస్థితిపై ఆరా తీశారు. అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రెఢీ..
ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కుంటలు, చెరువులు, డ్యాంలు, రిజర్వాయర్లకు వస్తున్న వరదపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకొని, చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పైళ్ల శేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగ రావు, సీఎంవో కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిజి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ కూడా రివ్యూ
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డేతో ఉదయం ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలో వర్షాలు, వరద పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. మిడ్ మానేరు, అప్పర్ మానేరు, అనంతగిరి ప్రాజెక్టుతోపాటు మానేరు నది వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలువలు, చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్స్ వద్ద కూడా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

అలర్ట్
రోడ్లు, భవనాల శాఖ అధికారులు, బ్రిడ్జిలు, కల్వర్టులను పరిశీలిస్తూ.. అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. తెగిపడ్డ విద్యుత్ తీగలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, విద్యుత్, పోలీసు, ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని చెప్పారు. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు.












Click it and Unblock the Notifications