Dussehra:జమ్మిచెట్టుకు ఎందుకు పూజ చేయాలి..? పాలపిట్టను ఎందుకు చూడాలీ..?
దసరా పండుగకు పాలపిట్టతో విడదీయరాని అనుబంధం ఉంది. విజయ దశమి రోజు శమీ పూజ, రావణ దహనంతోపాటు పాలపిట్టను దర్శించుకోవడం ఎన్నో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజు పాలపిట్ట కనిపిస్తే శుభసూచికంగా భావిస్తారు. శమీ పూజ అనంతరం పాల పిట్టను చూసేందుకు ప్రజలు ఉత్పాహం చూపిస్తారు. ఊరి చివరకు, పొలాల మధ్యకు వెళ్లి మరి పాలపిట్ట కనిపిస్తుందేమోనని ఎదురుచూస్తారు.

ఆ పరమేశ్వరుడి స్వరూపం
పాలపిట్ట మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్ధికి సంకేతంగా భావిస్తారు. చాలామంది ఈ పక్షిని పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తుంటారు. దసరా రోజు పాలపిట్ట చూస్తే అన్ని శుభాలే జరుగుతాయని విశ్వసిస్తారు. నమ్మకం వెనుక పురాణగాథలు ఉన్నాయి. త్రేతా యుగంలో రావణాసురుడితో శ్రీరాముడు యుద్ధానికి బయలుదేరిన సమయంలో విజయ దశమి పాలపిట్ట ఎదురుగా కనిపిస్తుంది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధిస్తాడు. దీంతో పాలపిట్టను శుభశకునంగా భావించారని పురాణాలు చెబుతున్నాయి. అజ్ఞాత వాసానికి ముందు పాండవులు జమ్మి చెట్టు మీద దాచిన ఆయుధాలను ఇంద్రుడు పాలపిట్ట రూపంలో కాపాలా కాశాడని మరో పురాణ గాథ చెబుతుంది.

ఎదురుకావడంతో..
పాండవులు అజ్ఞాత వాసం ముగించుకుని తిరుగు ప్రయాణంలో వారికి పాలపిట్ట దర్శనమిచ్చింది. అప్పటినుంచి వారి కష్టాలు తొలగిపోయాయి. కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడంతోపాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందారు. పాలపిట్ట కనిపించినప్పటి నుంచి పాండవులు ఏం చేసినా విజయాలే కలిగాయని మరో విశ్వాసం ఉంది. దసరా రోజు పాలపిట్టను చూస్తే శుభాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. పాల పిట్ట ఉత్తర దిక్కు నుంచి ఎదురైతే ఇంకా మంచిదని, శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. దక్షిణం దిక్కు నుంచి వస్తే అశుభానికి సంకేతమని కూడా ప్రచారంలో ఉంది. పురాణాలు, సాంస్కృతిక పరంగా పాలపిట్టకు ఇంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టే.. దీన్ని మన రాష్ట్ర పక్షిగా గుర్తించి గౌరవం ఇచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, బిహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపిట్టే కావడం విశేషం.

ఆశీర్వాదం
శమీ పూజ చేసి జమ్మి ఆకులను పెద్దలకు పంచి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఏళ్ల నుంచి ఆనవాయితీగా ఉంది. దసరా రోజు జమ్మి ఆకులను బంగారంలా పంచుకుంటారని మనందరికీ తెలుసు. జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు? శమీ పూజ తర్వాత జమ్మి ఆకులను ఎందుకు పంచుకుంటారనే కారణం మాత్రం తెలియదు. కానీ దీని వెనుక పురాణ గాథలు అనేకం ఉన్నాయి. రుగ్వేద కాలం నుంచి జమ్మి ప్రస్తావన ఉంది. జమ్మి చెట్టును సంస్కృతంలో శమీ వృక్షం అని పిలుస్తారు. అమృతం కోసం దేవ దానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయట. అందులో శమీ వృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీన్ని అరణి అని కూడా పిలుస్తారు.

శమీ పూజ
త్రేతా యుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీ రాముడు శమీ పూజ చేసి వెళ్లాడంట. అందుకే రావణుడి మీద విజయం సాధించడానికి రామాయణ గాథ చెప్తోంది. మహా భారతంలో పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమీ వృక్షంపై ఉంచారు. తమ అజ్ఞాత వాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని శమీ వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్లారంట. అజ్ఞాత వాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు శమీ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు. అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు. అప్పటినుంచి విజయ దశమి రోజున శమీ వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని ఒక నమ్మకంగా మారింది. దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవిని పూజిస్తారు.

బంగారం..
జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను తుంచుకుని వాటిని బంగారంలా ఇంటికి తీసుకెళ్తారు. దసరా రోజు శమీ పూజ తర్వాత జమ్మి చెట్టు కొమ్మలను కొట్టే సమయంలో అక్కడికి రాలేని పెద్దలకు ఆ ఆకులను ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవడమనే అందరూ నమ్ముతారు.

నీరు ఉన్నా లేకున్నా..
జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువకాలం బతుకుతుంది. ఈ జమ్మి చెట్టు ఆకులు రాలుతుంటే కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. పూర్తిగా ఆకులు రాలి చెట్టు బోసిపోయినట్లు ఎప్పుడూ కనిపించదు. ఇప్పటి యువతకు, నగరవాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ చెట్టు వేళ్లు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. అందుకే శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని చెబుతుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే దసరా నాడు రైతులు కూడా తమ పశుపక్ష్యాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తారు. దసరా పండగకు జమ్మిచెట్టు, పాల పిట్టకు గల ప్రత్యేకతలు ఇవీ.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications