Shamshabad Air Port: ఇంకా చిక్కని చిరుత.. ఎక్కడ నక్కిందో..!
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆపరేషన్ చిరుత 5వ రోజుకు చేరుకుంది. అయినా కూడా అటవీ అధికారులు చిరుతను పట్టుకోలేకపోయారు. గత ఐదు రోజులుగా చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎయిర్ పోర్టులోని అటవీ ప్రాంతంలో ఉన్న స్థలంలో బోన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 5 బోన్లు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
25 సీసీ కెమెరాలు అమర్చి చిరుత కదలికలను గుర్తిస్తున్నారు. చిరుత ఎక్కువగా వెళ్తున్న ప్రాంతంలో బోను ఏర్పాటు చేశారు. అటవీ శాఖ అధికారులు చిరుత కదలికలను ఎప్పటికప్పుడు చూస్తున్నారు. చిరుతకు ఎరగా బోన్లలో మేక పిల్లలను ఉంచారు. చిరుత బోను వరకు వస్తుందని.. కానీ లోపలికి మాత్రం వెళ్లడం లేదని అధికారులు చెబుతున్నారు.

చిరుత తనను పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేసినట్లు అర్థం చేసుకుందని తెలుస్తోంది. దీంతో దాన్ని బంధించడం కోసం అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎయిర్ పోర్ట్ సిబ్బంది, పరిసరా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. శంషాబాద్, చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు చిరుతను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఎయిర్ పోర్ట్ రన్ వే పై చిరుత పులి ఉన్నట్లు పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు. చిరుత గొల్లపల్లి వద్ద ఎయిర్ పోర్టు ప్రహరి గోడ దూకినట్లు గుర్తించారు. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. చిరుత తనతో పాటు పిల్లలు ఉన్నందునే బోను లోకి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి ఆపరేషన్ చిరుత ఎప్పుడు పూర్తవుతోంది.












Click it and Unblock the Notifications