కేసీఆర్ సర్కారు అంతానికే ఇదంతా: ఈటల రాజేందర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్: అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం బయటకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ నుంచి రక్షక్ వాహనంలో ఆయనను తీసుకెళ్లారు. తన వాహనంలో కాకుండా పోలీసు వాహనంలో తీసుకెళ్లడంపై ఈటల రాజేందర్ మండిపడ్డారు.

అరెస్ట చేస్తారా? బానిసలా కనిపిస్తున్నానా? అంటూ ఈటల ఆగ్రహం
బానిసలా కనిపిస్తున్నానా? అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. తనను అరెస్ట్ చేస్తే నోటీస్ ఇవ్వాలి కదా? అని అడగినా.. పోలీసులు సమాధానం చెప్పట్లేదన్నారు .
పోలీసు వాహనంలో ఈటలను ఆయన నివాసానికి తరలింపు
పార్టీ ఆఫీస్ దగ్గరకు వెళ్తానని చెప్పినా వినకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. పోలీసులు ఈటల రాజేందర్‌ను శామీర్ పేటలోని ఆయన నివాసానికి తరలించారు.

కేసీఆర్ సర్కారు నాశనానికే ఇదంతా అంటూ ఈటల
ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై ఈటల రాజేందర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. మీ నాశనానికే ఇదంతా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏడాది కాలంగా తనపై కుట్రలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ సర్కారును గద్దె దించేవరకూ విశ్రమించనంటూ ఈటల
తన గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ ను గద్దె దించే వరకు విశ్రమించను అని ఆయన అన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని కేసీఆర్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్.

అసెంబ్లీలోనూ ఈటల రాజేందర్ సీరియస్
అయితే, అంతకు ముందు స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలకు ఈటల క్షమాపణ చెప్పకపోవటంతో సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. మొదట ఈటల రాజేందర్.. స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు . స్పీకర్ పై ఈటల వ్యాఖ్యలు సరికాదన్నారు. చర్చ కంటే బీజేపీ రచ్చ చేయాలని చూస్తుందని మండిపడ్డారు. అయితే ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఈటల రాజేందర్... సభ్యుడిగా సభలో మాట్లాడే అవకాశం ఉందా? లేదా ?... అని ప్రశ్నించారు. స్పీకర్ పై నాకు గౌరవం ఉందా.. లేదా అనేది ఇతరులు ఎలా డిసైడ్ చేస్తారని ఈటల సీరియస్ అయ్యారు . ఆ తర్వాత ఈటలను సస్పెండ్ చేస్తూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టారు . దీనికి స్పీకర్ ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి.












Click it and Unblock the Notifications