హైదరాబాద్‌లో రూ. వెయ్యి కోట్లతో యూరోఫిన్స్ అత్యాధునిక ల్యాబ్ క్యాంపస్
ఫ్రాన్స్‌కు చెందిన ఔషధాల ఉత్పత్తి, పరిశోధన సంస్థ యూరోఫిన్స్ రూ. 1000 కోట్లతో హైదరాబాద్‌లో అత్యాధునిక ల్యాబ్ లతో కూడిన ప్రాంగణాన్ని ఏర్పాటు చేయబోతోంది.
హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా, ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ ఔషధ, ఆహార, పర్యావరణ, సౌందర్య సాధనాల ఉత్పత్తి, పరిశోధన సంస్థ యూరోఫిన్స్ రూ. 1000 కోట్లతో హైదరాబాద్ నగరంలోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ల్యాబ్ లతో కూడిన ప్రాంగణాన్ని ఏర్పాటు చేయబోతోంది.
15 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న కొత్త ప్రాంగణంలో 90 వేల చదరపు అడుగుల్లో ప్రయోగశాలను నిర్మిస్తారు. ఇతర కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని, దీంతో 1500 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. యూరోఫిన్స్ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షురాలు, బయోఫార్మా విభాగం ప్రెసిడెంట్ నటాలియా షుమన్ శనివారం తమ ప్రతినిధి బృందంతో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు.

తాము ఏర్పాటు చేయబో కేంద్రం ద్వారా భారతదేశంలో కొత్త ఔషధాల అన్వేషణతోపాటు ఇతర దేశాలకు చెందిన ఔషధ, బయోటెక్ సంస్థలకు ఉత్పాదక, అభివృద్ధి, పరిశోధన సేవలందిస్తామని నటాలియా వెల్లడించారు.
జనవరిలో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా యూరోఫిన్స్ సంస్థ ప్రతినిధులు కేటీఆర్ సమావేశమై రాష్ట్రంలో కొత్త పెట్టుబడుల గురించి చర్చించారు. ఇందుకు అనుగుణంగా తాజాగా, ప్రాంగణం ఏర్పాటు నిర్ణయాన్ని తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా యూరోఫిన్స్ కొత్త ప్రయోగశాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, ఇది తెలంగాణ ఫార్మా రంగానికి మరింత ఊతమిస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications