GHMC Elelctions 2020:KTR vs BJP:ప్రచార బరిలోకి అమిత్ షా, యోగీ ఆదిత్య నాథ్..? సీన్ మారుస్తారా.?
గ్రేటర్ వార్ తారాస్థాయికి చేరుకుంది. ఇక పోలింగ్‌కు మరో 10 రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలు ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక మరో మూడేళ్లలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో సత్తా చాటి ఆ ఎన్నికలకు సన్నద్ధం కావాలని కమలం పార్టీ కత్తులు దూస్తుండగా... తిరిగి గ్రేటర్‌లో మేయర్ పదవి దక్కించుకోవాలని కారు పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. ఇక ప్రచారంలో కాంగ్రెస్ ఈ రెండు పార్టీల కంటే వెనకాలే ఉందని తెలుస్తోంది. దుబ్బాక గెలుపుతో మాంచి ఊపుమీదున్న బీజేపీ.. ఆ ఊపును జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా కొనసాగించాలన్న కసితో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే రంగంలోకి అమిత్ షాతో పాటు పలువురు జాతీయ స్థాయి నాయకులు కూడా రంగంలోకి దిగనున్నారు.
GHMC Elections 2020:ఎవరి డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు సార్.. అమిత్ షాకు కేటీఆర్ సవాల్

గ్రేటర్‌లో నువ్వా నేనా
దుబ్బాక ఫలితంతో జోష్ మీదున్న కమలం పార్టీ కారు పార్టీకి ప్రత్యర్థిగా మారింది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌గా ఉన్న పోటీ దుబ్బాక ఫలితంతో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్‌లు ప్రచారం సందర్భంగా మాటలతో కత్తులు దూసుకోగా... ఈ సారి మాత్రం కాంగ్రెస్ ప్లేస్‌ను బీజేపీ భర్తీ చేసినట్లుగా కనిపిస్తోంది. మాటల యుద్ధం మొత్తం టీఆర్ఎస్ - బీజేపీల మధ్యే కొనసాగుతోంది. సీన్ ఓల్డ్ సిటీకి మారితే మాత్రం అక్కడ వార్ బీజేపీ వర్సెస్ మజ్లిస్‌గా మారుతోంది.

కేటీఆర్ వన్ మ్యాన్ షో
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీల ప్రచారాలు పుంజుకుంటున్నాయి. టీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్ వన్ మ్యాన్ షో నడుపుతుండగా బీజేపీ తరపున పలువురు ప్రచార బాధ్యతలను మోస్తున్నారు. దుబ్బాక విజయంతో గ్రేటర్‌లో కసితీరా పనిచేసి మేయర్ పదవి దక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ప్రచారంను హోరెత్తిస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నగరంలోనే తిష్ట వేసి ఉండగా... రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారంలో జోష్‌ను నింపుతున్నారు. సోమవారం మంగళవారాల్లో బీజేపీ యువనేత బెంగళూరు దక్షిణం ఎంపీ తేజస్వీ సూర్య తనదైన శైలిలో మజ్లిస్ పై నిప్పులు చెరిగారు. ఇక బండి సంజయ్ కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ మేయర్ పీటం కైవసం చేసుకుని ప్రధాని మోడీకి కానుకగా ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే అగ్రనాయకులను ప్రచారానికి దింపేందుకు ప్లాన్ సిద్ధం చేసింది.

అమిత్ షా అస్త్రంతో బీజేపీ
గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేసే బాధ్యత మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ఎప్పటిలాగే తన పదునైన మాటలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నాడు. కొన్ని పంచ్ డైలాగ్స్‌తో కేటీఆర్ ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతున్నారు. అయితే వార్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిన నేపథ్యంలో ఏకంగా అమిత్ షా పైనే ఈ గులాబీ యువనేత విమర్శనస్త్రాలను సంధిస్తున్నారు. ఎవరి పైసలు ఎవరు ఖర్చు పెడుతున్నారంటూ అమిత్ షాను ఎల్‌బీ నగర్ రోడ్ షో వేదికగా మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాదుకు ఏమి తీసుకొచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. కేటీఆర్‌ను టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ తమ ఆయుధం అయిన అమిత్ షాను గ్రేటర్ పై వదిలేందుకు సిద్ధంగా ఉంది. రానున్న రోజుల్లో అమిత్ షా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు.

యోగీ ఆదిత్యనాథ్ కూడా ప్రచారం..?
అమిత్ షా రంగంలోకి దిగి ప్రచారం చేస్తే ఫలితాలు తారుమారయ్యే అవకాశాలున్నాయి. అప్పటి వరకు ఒకరికి ఓటు వెయ్యాలని ఫిక్స్ అయి ఉన్న ఓటర్లు తమ అభిప్రాయం మార్చుకునేలా అమిత్ షా ప్రభావితం చేయగలరు. అందుకే అమిత్ షా అస్త్రాన్ని వదలాలని బీజేపీ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో కమలం అమ్ముల పొది నుంచి రానున్న మరో అస్త్రం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. ఇక యోగీ ఆదిత్య నాథ్ కూడా హైదరాబాదులో ప్రచారం నిర్వహిస్తారని సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యోగీ ఆదిత్యనాథ్ హైదరాబాదులో ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో హైదరాబాదు పేరును భాగ్యనగరంగా మార్చాలంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రచారం చేశారు. ఇప్పుడు మళ్లీ ఇదే నినాదంతో బీజేపూ గ్రేటర్‌లో ప్రచారం చేస్తోంది.
మొత్తానికి అమిత్ షా వచ్చినా... యోగీ ఆదిత్యనాథ్ వచ్చినా.. ఏకంగా ప్రధాని మోడీ వచ్చి ప్రచారం చేసినా వార్ వన్ సైడ్ అవుతోందంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. సింహం సింగిల్‌గా వస్తుందని వారంతా కేటీఆర్ ముందు బలాదూరే అనే కాన్ఫిడెన్స్‌ను వ్యక్తం చేస్తున్నాయి గులాబీ శ్రేణులు.