జైళ్లలో ఖైదీలకు కరోనా టెస్టులు చేశారా..? ఎంతమందికి నిర్వహించారు.. సర్కార్‌కు హైకోర్టు
జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనా పరీక్షలు చేశారా అని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అండర్ ట్రయల్స్ ఖైదీలు, శిక్ష పడినవారికి టెస్ట్ చేశారా అని డివిజన్ బెంచ్ అడిగింది. పరీక్షలు చేస్తే ఎంతమందికి.. ఏయే జైళ్లలో చేశారు అని కొశ్చన్ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఖైదీల కరోనా వైరస్ పరీక్షలపై ప్రభుత్వాన్ని, జైళ్లశాఖ డీజీకి అడిగింది.
జైళ్లలో ఎంత మందికి పాజిటివ్ వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. పాజిటివ్ వచ్చిన వారిని ఐసొలేట్ చేశారా.. లక్షణాలు ఉన్న వారికి ఏ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు అని నిలదీసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని జైళ్లశాఖను ఆదేశించింది. పూర్తి వివరాలతో వచ్చేనెల 9లోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టంచేసింది. తదుపరి విచారణను ధర్మాసనం సెప్టెంబరు 10వ తేదీకి వాయిదా వేసింది.

కరోనా వైరస్ విస్తరించడంతో ఐదేళ్లు.. అంతకన్నా ఎక్కువ సమయం జైళ్లలో ఉన్న వారికి బెయిలు మంజూరు చేయకపోవడాన్ని సవాలుచేస్తూ సామాజిక కార్యకర్త యు సాంబశివరావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపించారు. చంచలగూడ జైలు సూపరింటెండెంట్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
Recommended Video
సిబ్బందికి కరోనా సోకిందని కాదు.. ఖైదీలకు సోకింది, దానికి సంబంధించి ఆధారాలు చూపాలని పిటిషనర్‌ను ధర్మాసనం కోరింది. రాష్ట్రంలో రోజు 40 వేల కరోనా పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని.. మరీ జైళ్లలో ఉన్న వారిలో ఎంతమందికి పరీక్షలు చేశారని ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. ముంబై జైలులో 55 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చిందని, ఇక్కడ కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తేనే వాస్తవలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications