తమిళిసై, చంద్రబాబు వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్: వీడియోలతో ట్వీట్లు
హైదరాబాద్: తెలంగాణకు మెడికల్ కాలేజీల కేటాయింపు విషయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. మెడికల్ కాలేజీల కేటాయింపు విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆయన ఆరోపించారు.

ట్విట్టర్ వేదికగా కేంద్రంపై హరీశ్ రావు ఫైర్
దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీల ఏర్పాటు శ్రీకారం చుట్టిన కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా రాష్ట్రానికి ఒక్క కాలేజీని కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ఈ మేరకు అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రాన్ని మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కోరారని.. అందుకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని పేర్కొంటూ ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు మంత్రి హరీశ్ రావు.
గవర్నర్, కేంద్రమంత్రుల వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వం సకాలంలో మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోలేదంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన హరీశ్ రావు వరుస ట్వీట్లు చేశారు. మెడికల్ కాలేజీల కేటాయింపులో కేంద్రమంత్రులు పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకరు తెలంగాణ మెడికల్ కాలేజీలు కావాలని కోరలేదంటే.. మరొకరు ప్రైవేటు మెడికల్ కాలేజీలున్న ఖమ్మం, కరీంనగర్‌లో కొత్త కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోవడం వల్లే కొత్తవి మంజూరు చేయలేదంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా తన ట్వీట్ కు జతచేశారు మంత్రి హరీశ్ రావు.
తెలంగాణకు అన్యాయం చేసి విమర్శలా?: హరీశ్ రావు
తెలంగాణ గవర్నర్ తన పంథాను మార్చుకుని.. ట్రైబల్ యూనివర్సిటీ, రైల్ కోచ్‌లు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తే రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన వారవుతారని హరీశ్ రావు హితవు పలికారు. ప్రతి లక్ష మందికి 19 మెడికల్ సీట్లతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు హరీశ్ రావు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్.. రాష్ట్ర నిధులతో 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని చెప్పారు. కేంద్రం, గవర్నర్ అనవసరంగా విమర్శలు చేసే బదులుగా ఒకే రోజు 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన తెలంగాణను అభినందించాలని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. బీబీనగర్ ఎయిమ్స్‌కి నిధుల కొరత ఉందని.. దేశ వ్యాప్తంగా ఎయిమ్స్ వృద్ధి కోసం రూ. 1365 కోట్లు మంజూరు చేస్తే అందులో తెలంగాణకు మాత్రం కేవలం రూ. 156 కోట్లే కేటాయించారన్నారు. గుజరాత్ ఎయిమ్స్‌కి 52 శాతం నిధులిచ్చిన కేంద్రం.. తెలంగాణకు 11.4 శాతం నిధులు మాత్రమే ఇచ్చిందని మండిపడ్డారు.

చంద్రబాబు వ్యాఖ్యలకు లెక్కలతో హరీశ్ కౌంటర్
మరోవైపు, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు కూడా హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం స్థాపించకముందు తెలంగాణ ప్రజలకు వరి అన్నం తెలియదని.. జొన్నలు, రాగులు, సజ్జలు తిన్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఎవరు ఎవరికి అన్నం పెడుతున్నారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలతో వరి సాగు లెక్కలు తీశానని హరీశ్ రావు చెప్పారు. ఏపీ కన్నా తెలంగాణలోనే ఎక్కువగా వరి సాగు అవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో 54 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని తెలిపారు. ఏపీలో 16 లక్షల ఎకరాల్లో వరి సాగ అయిందన్నారు. మరి ఇప్పుడు ఎవరు ఎవరికి అన్నం పెడుతున్నారంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణ నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతోందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications