మరో 3 రోజులు భానుడి భగ భగలు.. రోహిణి కార్తె కన్నా మిన్న, జనం బెంబేలు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే ఎండ వేడిమి.. ఉక్కపోత మొదలవుతుంది. వడగాలులు కూడా వీస్తాయని.. జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు అవుతుంది. శుక్రవారం నుంచి మరో మూడు రోజుల పాటు తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.
ఇవాళ, రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా చోట్ల సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఉత్తర తెలంగాణలో సాధారణం కన్నా తక్కువగా, దక్షిణ తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువగా.. ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఎండ వేడికి హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 105 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే.. కళ్లుతిరిగి పడిపోయే అవకాశం ఉంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఉదయం 11 గంటల్లోపే ఇళ్లకు చేరాలని సూచిస్తున్నారు. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి, ఆదిలాబాద్ జిల్లా చేప్రాలలో 43.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఉపరితల ద్రోణి ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు తీవ్రమై గాలిలో తేమ 51 శాతానికి తగ్గిందని చెప్పింది. గాలిలో తేమ శాతం తగ్గడంతో పొడిగాలులు వీస్తున్నాయని వివరించింది.
చత్తీస్ ఘడ్ నుండి ఇంటీరియర్ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి శుక్రవారం విదర్భ నుంచి తెలంగాణా మీదగా ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి సుమారు 0.9 కిమి ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో వచ్చే మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సజెస్ట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications