పనోళ్లుగా వచ్చారు.. అంతా పసిగట్టారు.. రిటైర్డ్ ఐఎఎస్ అధికారికి 63 లక్షల కుచ్చుటోపి
హైదరాబాద్ : నమ్మి ఆశ్రయం కల్పిస్తే.. యజమానికే కుచ్చుటోపి పెట్టింది ఓ జంట. హైదరాబాద్ లో నివసించే రిటైర్డ్ ఐఎఎస్ అధికారి గంగోపాధ్యాయ ఇంట్లో చిత్తూరు జిల్లాకు చెందిన దంపతులు పనికి కుదిరారు. వెంకటరమణ కారు డ్రైవర్ గా, అతడి భార్య పనిమనిషిగా చేస్తూ ఏడేళ్లుగా నమ్మకంతో ఉంటున్నారు. అయితే సదరు రిటైర్డ్ అధికారికి వయసు మీద పడటంతో ప్రతి పనికి వెంకటరమణ మీద ఆధారపడటం అలవాటైంది. అలా ఆయన బ్యాంకు లావాదేవీలు, ఇతరత్రా నగదు వ్యవహారాల్లో వెంకటరమణ సాయం తీసుకునేవాడు.

అదలావుంటే ఏడాది కిందట వెంకటరమణ దంపతులకు దుర్బుద్ధి పుట్టింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు గంగోపాధ్యాయ బ్యాంక్ అకౌంట్ లో నుంచి 63 లక్షల రూపాయలు నొక్కేశారు. ఆ ఇంటి సమీపంలోని నెట్ సెంటర్ యజమానిని మచ్చిక చేసుకుని.. గంగోపాధ్యాయ అకౌంట్ నుంచి తన అకౌంట్లోకి డబ్బు ట్రాన్స్ ఫర్ చేసుకునేవాడు వెంకటరమణ. ఆ సమయంలో గంగోపాధ్యాయ మొబైల్ ఫోన్ తన భార్య దగ్గర ఉండేట్లు జాగ్రత్తపడేవాడు. అమౌంట్ బదిలీచేసేటప్పుడు మొబైల్ కు వచ్చే ఓటీపీని భార్యను అడిగి తెలుసుకునేవాడు. అలా నమ్మినబంటుగా ఉంటూ ఏడాది వ్యవధిలో 63 లక్షలు స్వాహా చేశారు. ఆ డబ్బులతో రెండు కార్లను కొన్నారు.
ఎట్టకేలకు అకౌంట్ నుంచి డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించిన గంగోపాధ్యాయ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో వెంకటరమణ దంపతుల లీలలు బయటపడ్డాయి. వెంకటరమణ దంపతులను విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి రెండు కార్లను స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు.












Click it and Unblock the Notifications