హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటుడు గోవింద ఫ్యామిలీ
హైదరాబాద్: చారిత్రక చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని మంగళవారం బాలీవుడ్ నటుడు గోవింద సతీ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా గోవిందా, ఆయన భార్య సునీతతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవిందా దంపతులు మహా హారతిలో పాల్గొన్నారు.
చార్మినార్ శ్రీ భాగ్య లక్ష్మి ఆలయాన్ని సందర్శించిన గోవిందా దంపతులను ఆలయ ట్రస్టీ చైర్మన్ శశికళ షాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం బాలీవుడ్ నటుడు గోవిందా మీడియాతో మాట్లాడుతూ.. సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకె గౌరీ నారాయణీ నమోస్తుతే... మాతృదేవో భవ అంటూ తన ప్రసంగం మొదలు పెట్టాడు.

అమ్మవారి ఆశీర్వాదంతో తాను సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు. తన భార్య సునీతతో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాలని అనుకున్నానని, తన భాగ్యంతో అమ్మవారు ఇప్పుడు ఆ అవకాశం ఇచ్చిందన్నారు. తన అమ్మ నమ్లా దేవి గాయత్రీ దేవి ఉపాసన తీసుకుందని, తన అత్త సావిత్రీ కూడా మరో అమ్మ రూపంలో వచ్చిందని అమ్మలకు సేవ చేసుకునే భాగ్యం కలిగిందన్నారు.
ఈశ్వరుని కృపతో కీర్తి ప్రతిష్టలు, సంపద అన్నీ లభించాయన్నారు. తన జీవితంలో మున్ముందు ఎలాంటి దుఃఖాలు, నష్టాలు, కష్టాలు రాకుండా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్టు గోవింద చెప్పారు. హైదరాబాద్ గడ్డపై ఎన్నో హిట్ సినిమాలు తనకు అందించాయని, ఇక్కడికి తన భార్యతో రావడం సంతోషంగా ఉందన్నారు బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద.

భాగ్యలక్ష్మి అమ్మవారి పేరుపైనే భాగ్యనగరం
పూర్వం ఈ ఆలయం పేరు మీద హైద్రాబాద్ నగరాన్ని భాగ్యనగరం అని పిలిచేవారని చరిత్ర చెబుతోంది. ఆలయంలో లక్ష్మీ దేవి అమ్మవారిని పూజిస్తారు. ఈ దేవాలయంలో ప్రతి రోజు పూజలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం ఇక్కడ ఐదు సార్లు హారతి ఇస్తారు. దీపావళి పండుగ, బోనాల రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications