Growth Hubs Index: ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న నగరాల్లో హైదరాబాద్ కు చోటు..!
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. ప్రముఖ గ్లోబల్ ప్రాపర్టీ అడ్వైజర్ అయిన సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నగరాల్లో హైదరాబాద్ 5వ స్థానంలో నిలిచింది. గ్రోత్ హబ్స్ ఇండెక్స్ 2033 నాటికి GDP పెరుగుదల, వ్యక్తిగత సంపద, జనాభా పోకడలు, వలసల నమూనాలు వంటి కీలక అంశాలను విశ్లేషించి ర్యాంకింగ్ ఇచ్చారు. ఇండియాలో వేగవంతమైన పట్టణీకరణతో, హైదరాబాద్ ఇతర ప్రధాన భారతీయులతో పాటు ప్రముఖంగా ఉండటంలో ఆశ్చర్యం లేదని పలువురు చెబుతున్నారు.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నగరాల జాబితాలో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో వియత్నాంలోని హోచిమిన్ సిటీ ఉండగా.. మూడో స్థానంలో ఢిల్లీ నిలిచింది. 4వ స్థానంలో చైనాలోని షెన్‌జెన్ ఉంది. వియత్నాంలోని హెనోయి ఆరో స్థానం దక్కించుకుంది. ఏడో స్థానంలో చైనాలోని గ్వాంగ్‌జౌ ఉంది. 8వ స్థానంలో ముంబై ఉండగా.. 9వ స్థానంలో ఫిలిప్పీన్స్ లోని మనీలా ఉండగా.. 10వ స్థానంలో సౌదీ అరేబియా రాజధాని రియాద్ ఉంది.

హైదరాబాద్‌తో సహా దేశంలోని నగరాలు 2033 నాటికి 68 శాతం కంటే ఎక్కువ పెరుగుదలతో గణనీయమైన GDP వృద్ధిని సాధించగలవని ఇండెక్స్ అంచనా వేసింది. హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగం, యువ, అత్యంత నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి మద్దతుతో ఉందని వివరించింది. భాగ్యనగరం ఆర్థిక పురోగతిని నడపడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. దేశంలో పట్టణీకరణ వేగవంతం అయిందని.. ప్రతిభావంతుల ద్వారా హైదరాబాద్ ప్రయోజనం పొందుతుందని అంచనా వేసింది.
నగరానికి వలసలు గణనీయంగా పెరుగుతాయని గ్రోత్ హబ్స్ ఇండెక్స్ పేర్కొంది. దీంతో పట్టణ జనాభా పెరుగుతుందని తెలిపింది. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని అంచనా వేసింది. మరోవైపు తెలంగాణలో హైదరాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్ ను అభివృద్ధి చేయాలని డిమాండ్లు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications