తెలంగాణ బిడ్డ అరుదైన ఘనత : ప్రపంచంలో ఆ ఫీట్ సాధించిన మొట్టమొదటి గిరిజన బిడ్డ..
పదమూడేళ్లకే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి దేశవ్యాప్తంగా అందరి మన్ననలు పొందిన తెలంగాణ బిడ్డ మాలావత్ పూర్ణ.. తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది. అంటార్కిటికాలోని అత్యంత ఎత్తయిన శిఖరం(4,897మీ.) విన్సన్ మాసిఫ్‌ను పూర్ణ అధిరోహించింది. ఇది మాటలకు అందని అపూర్వ విజయం అని, పూర్ణ ఈ ఫీట్ సాధించినందుకు చాలా గర్వంగా ఉందని తెలంగాణ సాంఘీక సంక్షేమ విద్యాశాఖ ప్రకటించింది.

అరుదైన ఘనత సాధించిన మొట్టమొదటి గిరిజన బిడ్డ..:
ఏడు ఖండాల్లో ఉన్న అత్యంత ఎత్తయిన శిఖరాలన్నింటినీ అధిరోహించాలన్నది పూర్ణ కల. ఆ కలకు పూర్ణ ఇప్పుడు అత్యంత చేరువలో ఉంది. ఇప్పటివరకు ఎవరెస్ట్ (ఆసియా), కిలిమాంజారో (ఆఫ్రికా), ఎల్బ్రస్ (యూరప్), అకోన్కాగ్వా (దక్షిణ అమెరికా), కార్ట్స్‌నెజ్ (ఓషనియా) పర్వతాలను పూర్ణ అధిరోహించింది. తాజాగా విన్సంట్ మాసిఫ్‌ను కూడా అధిరోహించడంతో మరొక్కటి పూర్తి చేస్తే అత్యంత చిన్న వయసులో
ప్రపంచంలోని అన్ని ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన యువతిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పటికైతే ప్రపంచంలోని ఆరు అత్యంత ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన మొట్టమొదటి గిరిజన యువతిగా పూర్ణ చరిత్రలోకి ఎక్కింది. తదుపరి ఉత్తర అమెరికాలోని అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ డెనాలిని అధిరోహించేందుకు పూర్ణ సమాయత్తమవుతోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన పూర్ణ
విన్సంట్ మాసిఫ్ శిఖరాన్ని అధిరోహించినందుకు పూర్ణ చాలా సంతోషంగా ఉంది. పేదింటి బిడ్డలను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌లకు పూర్ణ ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బలమైన సహకారం లేకపోయి ఉంటే.. తాను ఈ ఫీట్ సాధించి ఉండకపోయేదానిని అని పూర్ణ తెలిపింది. పర్వతారోహణ అనంతరం సాటిలైట్ ఫోన్ ద్వారా ఆమె ఇక్కడి అధికారులతో మాట్లాడింది.

ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ధన్యవాదాలు
సాంఘీక సంక్షేమ విద్యాశాఖ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,కోచ్ శేఖర్ బాబు బాచినేపల్లిలకు కూడా పూర్ణ ధన్యవాదాలు తెలిపింది. తన విజయంలో వారి సహాయ సహాకారాలు కీలక పాత్ర పోషించాయని చెప్పింది.

పేదింటి బిడ్డ.. ప్రతిభతో శిఖరాలను అధిరోహించి..
నిజామాబాద్ జిల్లాలోని పాకాల అనే ఓ మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన మాలావత్ పూర్ణ ప్రతిభను ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ వెలుగులోకి తీసుకొచ్చారు. ఆమెను ట్రెక్కింగ్ వైపు ప్రోత్సహించి అవసరమైన సహాయ సహకారాలు అందజేశారు. దాంతో అత్యంత చిన్న వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన బాలికగా పూర్ణ చరిత్రలో నిలిచిపోయింది. ప్రస్తుతం అమెరికాలోని మిన్నెసొట స్టేట్ యూనివర్సిటీలో పూర్ణ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసిస్తోంది.












Click it and Unblock the Notifications