Hyderabad Rain: హైదరాబాద్ లో వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్..!
గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మణికొండ, జూబ్లీహిల్స్, మాదాపూర్, బోరబండ, మోతినగర్, ఎస్సార్ నగర్, బోరబండ, అమీర్ పేట, యూసఫ్ గూడలో వాన పడింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని పేర్కొంది.
వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వర్షం కురిసే సమంయలో గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వస్తాయని తెలిపింది.అలాగే ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్‌తో పాటు వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మంగళ, బుధవారం కామారెడ్డి, హైదరాబాద్, నిర్మల్, సిద్దిపేట, నాగర్ కర్నూల్, మేడ్చల్-మల్కాజిగిరి సహా పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.

హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సీజన్ లో తెలంగాణలో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైందని అధికారులు అంచనా వేశారు. నారాయణపేట జిల్లాలో అధిక వర్షపాతం నమోదు అయినట్లు వివరించారు. అయితే రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అటు ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
శుక్రవారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.












Click it and Unblock the Notifications