చిత్రహింసలకు గురిచేశారు: సాత్విక్ ఆత్మహత్య రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
హైదరాబాద్: ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగానే విద్యార్థి చనిపోయాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. సాత్విక్‌ను అసభ్యకరంగా తిట్టడం, తోటి విద్యార్థులు ముందు కొట్టడం వల్లే అతను మనస్తాపానికి గురయ్యాడని తెలిపారు.

సాత్విక్ ఆ నలుగురి వేధింపులు
శ్రీచైతన్య కాలేజీలో అడ్మిన్ ప్రిన్సిపల్ నర్సింహచారి అలియాస్ ఆచారి, కృష్ణారెడ్డి ప్రతిరోజూ సాత్విక్‌ను తిట్టడంతో మానసికంగా కుంగిపోయాడని పోలీసులు తెలిపారు. సాత్విక్ చనిపోయే ముందు రోజు తల్లిదండ్రులు వచ్చి వెళ్లగానే.. సాత్విక్‌ను ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి చితకబాదినట్లు పోలీసులు వెల్లడించారు. ఆచారి, కృష్ణారెడ్డి.. సాత్విక్ ఇంట్లో వారిని కూడా బూతులు తిట్టారని పేర్కొన్నారు. మరోవైపు, హాస్టల్‌లో సాత్విక్‌ను వార్డెన్ వేధింపులకు గురిచేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

కాలేజీ యాజమాన్యం వల్లే సాత్విక్ మృతి
నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో కాలేజీ యాజామన్యం వేధింపులకు గురిచేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాత్విక్.. మార్చి 1న కాలేజీలోని తరగతి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, యాజమాన్యం సరైన సమయంలో స్పందించివుంటే సాత్విక్ బతికేవాడని తోటి విద్యార్థులు తెలిపారు. మార్కుల గురించి ఎప్పుడూ కాలేజీ యాజమాన్యం అతడ్ని చిత్రహింసలకు గురిచేసేదని సాత్విక్ తమకు చెప్పాడని పేర్కొన్నారు.

సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన ఆ నలుగురు చర్లపల్లి జైలుకు
కాగా, సాత్విక్ తన సూసైడ్ నోట్‌లో తన మరణానికి కాలేజీ అడ్మిన్ ప్రిన్సిపల్ అకలంకం నర్సింహాచారి, ప్రిన్సిపల్ తియ్యగురు శివరామకృష్ణారెడ్డి, హాస్టల్ వార్డెన్ కందరబోయిన నరేశ్, వైస్ ప్రిన్సిపల్ ఒంటెల శోభాబు కారణమని పేర్కొన్నాడు. వారు తనను మానసికంగా వేధించారని, కొట్టి చిత్రహింసలకు గురిచేసేవారని తెలిపాడు. ఈ నేపథ్యంలో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ నలుగురిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. జడ్జీ ఆదేశాల మేరకు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.
అడ్మిషన్ లేని కాలేజీలో సాత్విక్ చదువుతున్నాడా?
ఇది ఇలావుండగా, ఇంటర్ బోర్డు ఎంక్వైరీ కమిటీ తన రిపోర్టులో పలు కీలక విషయాలను వెల్లడించింది. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న కాలేజీలో అతనికి అడ్మిషన్ లేదని తేల్చింది. అయితే, కాలేజీలో అడ్మిషన్ జరిగినప్పుడు నార్సింగిలోని శ్రీచైతన్య విద్యాసంస్థలతోనే రశీదు తమకు ఇచ్చారని సాత్విక్ తల్లిదండ్రులు తెలిపారు. తమ కుమారుడి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని సాత్విక్ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు.












Click it and Unblock the Notifications