కేసీఆర్ కళ్లల్లో ఆనందం కోసమే: బండి సంజయ్ అరెస్టుపై కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బండి సంజయ్‌ను తప్పుడు కేసులో ఇరికించారని మండిపడ్డారు. బుధవారం రాత్రి బీజేపీ కార్యాలయంలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. తమ చేతిలో అధికారం ఉందని కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీని ఎంత అణిచివేయాలని చూస్తే అంత బలంగా ఎదుగుతుందన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారమే బండి సంజయ్‌ను ఏ1గా పెట్టారని విమర్శించారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. కేసులకు, జైళ్లకు బీజేపీ నాయకులు భయపడబోరన్నారు.

బండి సంజయ్‌ను అర్ధరాత్రి అరెస్ట్ చేసి మానసికంగా వేధించారన్నారు కిషన్ రెడ్డి. సంజయ్‌ను అనేక స్టేషన్లు తిప్పుతూ తీసుకెళ్లారు. కనీసం ట్యాబ్లెట్ వేసుకునేందుకు కూడా సమయం ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. ఉగ్రవాదులను కూడా ఈ విధంగా తరలించలేదన్నారు. కేసీఆర్ కళ్లల్లో ఆనందం చూడటం కోసమే పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారని అన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కేసీఆర్ అరాచక పాలన మరింత ఎక్కువైందన్నారు.
సంజయ్‌కు ఒక జర్నలిస్టు వివరాలు అందించడం నేరమా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. జిల్లాల సమాచారాన్ని జర్నలిస్టులు నేతలతో పంచుకోవడం సహజమన్నారు. సమాజ హితం కోసం, అవినీతి పాలనకు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా సమాచారం ఇచ్చే సంప్రదాయం జర్నలిస్టులకు ఉందన్నారు. కొన్ని అంశాలు పత్రికల్లో రాస్తారని.. కొంత సమాచారం నేతలకు ఇస్తారన్నారు. మిత్రులకైతే వ్యక్తిగతంగా సలహాలిస్తారన్నారు. 11.24 గంటలకు ప్రశాంత్ అనే జర్నలిస్టు అందరికీ పంపిన తర్వాత 11.30 గంటలకు బండి సంజయ్‌కు ప్రశ్నపత్రం పంపారని.. ఆ మెసేజ్ వచ్చినప్పుడు పరేడ్ గ్రౌండ్‌లో మీడియాతో మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రశ్నపత్రం బయటికి వచ్చిన రెండు గంటల తర్వాత సంజయ్‌కి చేరిందని తెలిపారు కిషన్ రెడ్డి.
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై పోరాటం చేసింది బండి సంజయ్, బీజేపీ అని కిషన్ రెడ్డి చెప్పారు. లక్షలాది మంది నిరుద్యోగులు కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూసి, ఆస్తులు అమ్మి, బంగారం అమ్మి , అప్పులు చేసి కోచింగ్ తీసుకున్నారని తెలిపారు. ఎంతో ఆశతో గ్రూప్-1 పరీక్ష రాస్తే.. ప్రభుత్వ చేతగానితనం, వైఫల్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు కిషన్ రెడ్డి. దీనిపై బీజేపీ పోరాటం చేసిందన్నారు. అక్రమ అరెస్టులతో ఈ రకమైన కుట్రలు చేయడం, మీడియా, రాజకీయ పార్టీల దృష్టి మళ్లించడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ అరెస్టుపై న్యాయ పోరాటంతోపాటు రాజకీయంగా కూడా పోరాటం చేస్తామన్నారు. ప్రగతిభవన్ స్క్రిప్ట్ ప్రకారమే పోలీసులు నడుచుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రశాంత్ అనే వ్యక్తి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కూడా ఫొటోలు దిగారని.. వారు కూడా లీకేజీ కేసులో నిందితులేనా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications