Hyderabad: ఈ సాయంత్రం నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వైన్ షాపులు బంద్
హైదరాబాద్: మద్యం ప్రియులకు ముఖ్య గమనిక. ఈరోజు (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మద్యం షాపులు మూసివేయనున్నారు. అంతేగాక, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసి వేయాలని వైన్ షాపులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
హోలీ పండగ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ తోపాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగొద్దని, మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. అయితే, స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులు యథావిధిగా నడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ లు ఆదేశాలు జారీ చేశారు.

ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం (మార్చి 26) సాయంత్రం వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయనున్నారు. హోలీ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక, హోలీ వేడుకలు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా జరుపుకోవద్దని ప్రజలకు పోలీసులు సూచించారు.
రోడ్లపై ఇష్టారీతిన వేడుకలు జరుపుకోవద్దని, దీని వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఇతర ప్రజలకు ఇబ్బందిని కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రోడ్లపై వెళ్లే వారిపై, వాహనదారులపై రంగులు చల్లితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. రోడ్లపై గంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయొద్దని సూచించారు.












Click it and Unblock the Notifications