క్షేత్రస్థాయిలో ఆత్మీయసమ్మేళనాలు: పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం
బీఆర్ఎస్‌ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్: బీఆర్ఎస్‌ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలని పిలుపునిచ్చారు. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేస్తూ 60 లక్షల మంది పార్టీ శ్రేణులను చైతన్య పరిచేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్
పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని సూచించారు. పార్టీలో పనిచేసే కింది స్థాయి కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి నేతల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేసే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఆదివారం కేటీఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనాల ఏర్పాటుకు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సూచించారు.

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు కేటీఆర్ పిలుపు
ప్రతి 10 గ్రామాలను ఒక యూనిట్‌గా తీసుకుని ఎమ్మెల్యేలు.. పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. ప్రజాప్రతినిధులు వీలైనంత ప్రజల్లో ఉండాలన్నారు. జిల్లాల్లో పార్టీ కార్యాలయాలన్నీ ప్రారంభించుకోవాలని కేటీఆర్ సూచించారు. పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతోపాటు ఏప్రిల్ 25న నియోజకవర్గాల్లో పార్టీ ప్రతినిధుల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు పార్టీ కొన్ని కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. పట్టణాల్లో ఒక్కో పట్టణానికి, లేదంటే డివిజన్లను కలుపుకుని ఈ సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. సమ్మేళనాల్లో స్థానిక ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, కార్పోరేషన్ చైర్మన్లను, డీసీసీబీ, డీసీఎంఎస్ తదితర పార్టీ ముఖ్యులను కలుపుకొని పోవాలన్నారు.

కేసీఆర్ నాయకత్వంలో పార్టీ ముందుకు: కేటీఆర్
అమరవీరుల స్థూపం ఆవిష్కరణ నేపథ్యంలో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు కేటీఆర్. దీంతో పాటు 2023-24 విద్యా సంవత్సరం జూన్ నెల నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. పార్టీ విద్యార్థి విభాగ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటుందన్నారు. పార్టీ విద్యార్థి విభాగం నూతన కమిటీలను వేసుకోవడం ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్ వంటి వృత్తి విద్య కళాశాలలలో నూతన విద్యార్థులకు స్వాగత సభల పేరుతో కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేలా అందరం కలిసికట్టుగా పని చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఇచ్చిన కార్యాచరణపై వారంలో నేరుగా పార్టీ కార్యాలయంలో సమావేశం ఉంటుందని, ఈ మేరకు ఆయా కార్యక్రమాలపై స్థూలమైన ప్రణాళికను సిద్ధం చేసుకురావాలని కేటీఆర్ సూచించారు.












Click it and Unblock the Notifications