వైఎస్ షర్మిలకు బెయిల్: కీలక షరతులు విధించిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్: పోలీసులపై దాడి చేసిన కేసులో అరెస్టైన వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బెయిల్ లభించింది. పోలీసులపై దాడి చేసిన కేసులో సోమవారం అరెస్టైన షర్మిల చంచల్‌గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. షర్మిల బెయిల్ పిటీషన్‌పై మంగళవారం విచారణ జరిపింది నాంపల్లి కోర్టు.
వాదనలు విన్న అనంతరం షర్మిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విదేశాలకు వెళ్తే కోర్టు అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. రెండు ష్యూరిటీలు, రూ. 30వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. విచారణకు సహకరించాలని ఆదేశించింది. బెయిల్ లభించిన క్రమంలో చంచల్‌గూడ జైలు నుంచి షర్మిల మంగళవారం విడుదల కానున్నారు.

కాగా, పోలీసులపై దాడి కేసులో సోమవారం రోజున షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో షర్మిలను హాజరుపరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో షర్మిలను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా.. మంగళవారం కోర్టు షర్మిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు షర్మిలను ఆమె తల్లి విజయమ్మ నాంపల్లి కోర్టు వద్ద కలిశారు. షర్మిలకు బెయిల్ వస్తుందని.. అభిమానులు ఆందోళన చేయవద్దని, ప్రశాంతంగా ఉండాలని కోరారు.
ఏప్రిల్ 24వ తేదీ సోమవారంనాడు షర్మిల టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై దర్యాప్తు చేస్తున్న సిట్ ఆఫీస్‌కు వెళ్లబోతుందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను ముందస్తు అరెస్ట్ చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేస్తుండగా మహిళా కానిస్టేబుల్‌ను షర్మిల తోసేశారు. మరో మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. తోసేస్తూ ఎస్సై పట్ల దురుసుగా ప్రవర్తించారు. మరో కానిస్టేబుల్ కాలుపై నుంచి షర్మిల కారు పోనీయడంతో గాయాలయ్యాయి. ఈ క్రమంలో పోలీసులపై దాడి చేసిన కేసులో షర్మిలను అరెస్ట్ చేశారు. ఎస్సై రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 4 సెక్షన్లు 332, 353, 509, 427 కింద షర్మిలపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications