తెలంగాణలో వరదల ఎఫెక్ట్? భారీగా తగ్గిన కరోనా టెస్టులు: పాజిటివ్ కేసులు: మూడు జిల్లాల్లో జీరో
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితులు యధాతథంగా కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ పరీక్షలకు అనుగుణంగా పాజిటివ్ కేసుల ఫలితాలూ వెలువడుతున్నాయి. తెలంగాణ ఉత్తర ప్రాంతంలోని పలు జిల్లాలు వరద ముంపునకు గురి కావడం వల్ల కరోనా వైరస్ రోజువారీ పరీక్షల సంఖ్య ఒక్కసారిగా పడిపోయింది. దీని ప్రభావం కరోనా పాజిటివ్ కేసులపై పడింది. పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. వెయ్యి కంటే దిగువకే నమోదు అయ్యాయి. అదే సమయంలో డిశ్చార్జిల సంఖ్య భారీగా పెరిగింది. రెండువేలకుపైగా డిశ్చార్జిలు నమోదు అయ్యాయి.

కొత్తగా 893 కేసులు..
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 893 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించారు. 2006 మంది డిశ్చార్జి అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లుక వెళ్లారు. దీనితో ఇప్పటిదాకా తెలంగాణలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 92,255కు చేరుకుంది. ఇందులో 70,132 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 703కు పెరిగింది. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 21,420గా నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 14,404 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ కార్యాలయం బులెటిన్‌ను విడుదల చేసింది.

జీహెచ్ఎంసీ లిమిట్స్‌లో
తాజా వివరాల ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పడిపోయింది. కొత్తగా 147 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇదివరకు నమోదైన కేసులతో పోల్చుకుంటే.. జీహెచ్ఎంసీ లిమిట్స్‌లో కరోనా కేసుల్లో క్షీణత కనిపించింది. ఇదే పరిస్థితులు మున్ముందు కొనసాగే అవకాశాలు లేకపోలేదని ఆశిస్తున్నారు. మూడు జిల్లాల్లో జీరో కేసులు నమోదు అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట్, నిర్మల్ జిల్లాల్లో 24 గంటల్లో ఒక్క కేసు వెలుగులోకి రాలేదు.

జిల్లాలవారీగా కరోనా లెక్కలివీ..
24 గంటల్లో ఆదిలాబాద్-10, భద్రాద్రి కొత్తగూడెం-9, జగిత్యాల-31, జనగామ-7, జోగుళాంబ గద్వాల-21, కామారెడ్డి-7, కరీంనగర్-69, ఖమ్మం-44, కొమరంభీమ్ ఆసిఫాబాద్-11, మహబూబ్ నగర్-30, మహబూబాబాద్-31, మంచిర్యాల-17, మెదక్-8, మేడ్చల్ మల్కాజ్‌గిరి-51, ములుగు-6, నాగర్ కర్నూలు-15, నల్లగొండ-37, నిజామాబాద్-38, పెద్దపల్లి-62, రాజన్న సిరిసిల్ల- 2, రంగారెడ్డి-85, సంగారెడ్డి-29, సిద్ధిపేట్-58, సూర్యాపేట్-12, వికారాబాాద్-1, వనపర్తి-2, వరంగల్ రూరల్-9, వరంగల్ అర్బన్-44, యాదగిరి భువనగిరి-1 కేసులు నమోదు అయ్యాయి.

10 వేల కంటే తక్కువగా రోజువారీ శాంపిళ్లు..
24 గంటల వ్యవధిలో మొత్తం 8794 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీనితో ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 7,53,349కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్, సీబీనాట్ ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 20,291 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో 20 వేలకు పైగా రోజువారీ కరోనా వైరస్ పరీక్షలను నిర్వహిస్తూ వచ్చారు అధికారులు. ఆదివారం నాటికి ఈ సంఖ్య 10 వేల కంటే దిగువకు పడిపోయింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల ఇది సాధ్యం కాలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.












Click it and Unblock the Notifications