హైదరాబాద్ లో ఎన్ఐఏ దాడులు.. ఆ పత్రిక ఎడిటర్ ఇంట్లో సోదాలు!!
హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఇంటితోపాటు గురువారం తెల్లవారుజాము నుంచే అధికారులు సోదాలు చేపట్టారు. విరసం నేత వరవరరావు కు వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ అల్లుడు కావడంతో ఆయన ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో హిమాయత్ నగర్ లోని ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాలని భావిస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గత కొంత కాలం నుంచి మావోయిస్టులతో సంబంధాలు ఉన్న అనేక మంది ఇళ్లలో తనిఖీలు నిర్వహించింది. ఎల్బీనగర్లోని రవిశర్మ ఇంట్లో సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఇక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్న వారికి సంబంధించిన పూర్తి వివరాలు, అసలు ఎందుకు వీరి ఇళ్ళలో సోదాలు చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉన్నాయి. ఇదిలా ఉంటే గతంలోనూ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. మానవ హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న కొందరిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గట్టి నిఘా పెట్టి వారిపై దాడులకు పాల్పడుతోంది.
గతంలో హైదరాబాద్లోని అమరవీరుల బంధుమిత్రుల సంఘం కార్యకర్త భవాని ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు చేసింది. అలాగీ విద్యానగర్ లో సురేష్ ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. పౌర హక్కుల ఉద్యమాలలో ఉన్నవారు, మావోయిస్టులకు అనుబంధంగా పనిచేసేవారు తదితరులను గుర్తించే పనిలో ఉంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఐఏ దాడులు కొనసాగటం ఇదే మొదటిసారి.












Click it and Unblock the Notifications