భానుడి భగభగలు.. పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం విల విల
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచి వేడి ఎక్కువ అవుతుంది. సాయంత్రం కూడా వేడి గాలి వీస్తోంది. దీంతో జనం దాదాపుగా బయటకు రావడం లేదు. ఇంపార్టెంట్ పనులు ఉంటే తప్ప.. ఎక్కడివారు అక్కడే ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వేడి తీవ్రత పెరుగుతుంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో పగలు ఎండ, వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో రాత్రి వేళ 24 నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అవుతుంది. ఇదీ 28 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంటుందని వాతావరణ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం నిజామాబాద్‌లో అత్యధికంగా 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్‌లో 40 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 40 డిగ్రీలు, మహబూబ్ నగర్ జిల్లాలో 39 డిగ్రీలు, హైదరాబాద్‌లో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

విదర్భ నుంచి కర్ణాటక మీదుగా శ్రీలంక సరిహద్దు వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, వేడి గాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
పల్లెల్లో ఫరవాలేదు.. కానీ నగరాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఇంటి నుంచి బయటకు వెళితే ఉక్కపోతతో అల్లాడిపోవాల్సిందే. ఎండల నుంచి రక్షణగా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ అధికారులు సజెస్ట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications