విశ్వ గురు కాదు విష గురు.. ఇదీ సరికాదు, మోడీపై కేటీఆర్ ఆగ్రహాం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అవుతుంది. అంతా సవ్యంగా జరుగుతోన్న వేళ.. ప్రధాని మోడీ బాంబ్ పేల్చారు. ఏపీ విభజనపై హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌పై కామెంట్స్ చేసే క్రమంలో చేసిన కాంట్రవర్సీ వ్యాఖ్యలు వివాదం రేపాయి. దీనిపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు స్పందించారు. మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్విట్టర్‌లో విశ్వగురు కాదు విష గురు అంటూ చేసిన పోస్టుపై కేటీఆర్ స్పందించారు.

ఇదీ సరికాదు..
"మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఇది మీ స్థాయికి ఏమాత్రం తగినది కాదు" అని కేటీఆర్ హితవు పలికారు. "తెలంగాణ ప్రజల త్యాగాలను, దశాబ్దాల తరబడి సాగిన స్ఫూర్తిదాయక పోరాటాన్ని మీరు పదేపదే అవమానిస్తున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని చేసిన దారుణమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఈ వ్యాఖ్యల పట్ల ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

విషం చిమ్మిన మోడీ
తెలంగాణ ఏర్పాటు మీద మరోసారి విషం చిమ్ముతూ పార్లమెంట్‌లో అడ్డగోలుగా మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యల పట్ల రేపు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బిజెపి పార్టీ దిష్టిబొమ్మల దహనం చేయాలని కోరారు. నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

తలుపులు వేసి మరీ..
ఏపీ విభజనపై ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన అంశంలో కాంగ్రెస్ అధికార గర్వంతో పనిచేసిందని, శాంతియుతమైన పద్ధతిని పాటించలేదని విమర్శలు చేశారు. విభజన ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ హడావుడిగా పూర్తి చేసేసింది. ఏపీ వల్ల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ రాష్ట్రానికే అన్యాయం చేసింది. తెలంగాణ ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు. హడావుడిగా విభజన బిల్లును ఆమోదించేశారు. ఎలాంటి చర్చలు జరపకుండా మైక్‌లు కట్ చేశారు. మిర్చి స్ప్రే కొట్టారు. ఇదేనా ప్రజాస్వామ్య పద్ధతి ? అటల్ బిహారీ వాజ్‌పేయి మూడు రాష్ట్రాలను శాంతియుతంగా ఏర్పాటు చేశారు. ఎలాంటి తుఫాను లేకుండా.. అందరూ కలిసి కూర్చొని బిల్లు పాస్ చేశారు. ఏపీ-తెలంగాణ విభజనలోనూ అలా జరిగి ఉంటే బాగుండేదని అన్నారు. కాంగ్రెస్ అధికార గర్వం వల్ల సమస్యను జఠిలం చేసింది. దీని వల్ల ఏపీ, తెలంగాణ ఇంకా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సైతం లాభం జరగలేదన్నారు.












Click it and Unblock the Notifications