Hyderabad: ప్రీ లాంచింగ్ అంటూ మోసం.. రూ150 కోట్లు వసూలు..!
హైదరాబాద్ ఎంతో మందికి ఆశ్రయం ఇస్తున్న మహానగరం. ఎంతో మంది ఉపాధి కోసం భాగ్యనగరానికి వస్తున్నారు. చాలా మంది ఇక్కడే సెటిల్ అవుతున్నారు. లక్షలాది మంది సామాన్యులు సొంతిళ్ల కోసం కష్టపడుతున్నారు. రూపాయి, రూపాయి కూడబెట్టి సొంతింటి కళను నిజం చేసుకోవాలని కష్టపడుతున్నారు. వీరినే అసరాగా చేసుకుని కుప్పలు, తెప్పలుగా రియల్ ఎస్టేట్ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రీలాంచ్, బై బ్యాక్ పేరిట ప్రజలను మోసం చేస్తున్నారు. కోట్లు కొల్లగోడుతున్నారు.
పెద్ద కంపెనీలంటూ సినిమా స్టార్లతో, సెలబ్రిటీలతో భారీగా ప్రచారం చేయడంతో సామాన్యులు నమ్ముతున్నారు. తాజాగా.. ప్రీ లాంచింగ్ పేరుతో ఆర్‌జే గ్రూప్ అనే సంస్థ సుమారు 600 మందిని మోసం చేసింది. సామాన్య ప్రజల నుంచి ప్రీ లాంచింగ్ పేరుతో రూ.150 కోట్లను వసూలు బోర్డు తిప్పేసింది. నారాయణ్ ఖేడ్, ఘట్‌కేసర్, పఠాన్ చెరు, కర్దనూరు వంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్, ఫార్మ్ ల్యాండ్ పేరిట వెంచర్లను ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియా, టీవీల్లో భారీగా ప్రచారం చేశారు. సినీ ప్రముఖలతో యాడ్స్ చేయించారు.

ఈ సంస్థ 2022 నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. ఈ సంస్థలో ఒక్కొక్కరు రూ.20 లక్షల నుంచి 50 లక్షలు పెట్టుబడి పెట్టారు. నాలుగేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిర్మాణం చేపట్టలేదని బాధితులు ఆందోళనకు దిగడంతో ఆర్జే గ్రూప్ ఎండీ చెక్కులు రాసి ఇచ్చాడు. ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మరో సంస్థ సువర్ణ భూమి కూడా బై బ్యాక్ స్కీమ్ పేరుతో ప్లాట్లలో పెట్టుబడి సేకరించింది. ఈ కంపెనీ కూడా ఇప్పుడు మోసపూరిత సంస్థల జాబితాలో చేరడంతో పెట్టుబడి పెట్టిన వారు ఆందోళన చెందుతున్నారు.
బై బ్యాక్ స్కీముతో తమను మోసం చేశారంటూ కొందరు పెట్టుబడిదారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మూడు సంవత్సరాల క్రితం పెట్టుబడి పెడితే ఇంత వరకు తమ డబ్బు తిరిగి ఇవ్వలేదని బాధితులు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మోసాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెరాకు అప్పిలేట్ ట్రిబ్యునల్ ను నియమించారు. 40 ఉద్యోగాలను కూడా మంజూరు చేశారు. వీరంతా మోసం చేసిన కంపెనీల నుంచి బాధితులకు పరిహారం ఎలా ఇప్పించాలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications