రక్తమోడిన రహదారులు: మూడు ప్రమాదాల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో రహదారులు పలుచోట్ల రక్తమోడాయి. వేర్వేరు జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. వీరిలు నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. మరికొంత మంది తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ సమీపంలో ఆటో, బస్సు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతులను నాగలక్ష్మి, వరకాంతం, అనసూయ, ధనలక్ష్మి, దేవరపల్లి శిరీషగా గుర్తించారు.

బాధితులంతా దేవాలమ్మ నాగారం గ్రామానికి చెందినవారు. వీరంతా పారిశ్రామికవాడలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
మరో ప్రమాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. దిలావర్పూర్ మండలంలోని గుండంపల్లి గ్రామ ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. శ్రీనివాస్(29), అఖిల్(27), సతీష్(22) అనే ముగ్గురు యువకులు దిలావర్పూర్ నుంచి రాంపూర్ గ్రామానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బైంసా నుంచి నిర్మల్ వైపు వస్తున్న లారీ వేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీనివాస్, అఖిల్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సతీష్ కు తీవ్రగాయాలయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం అతడ్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఇద్దరు యువకులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలాన్ని డీఎస్పీ జవన్ రెడ్డి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి ఇలా ఉండగా, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ట్రాక్టర్, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కారు బలంగా ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్నవారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications