తెలంగాణలో మహిళలకు గుడ్‌న్యూస్: ఉమెన్స్ డే రోజున ప్రత్యేక సెలవు
మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు సాధారణ సెలవు ప్రకటిస్తూ.. సీఎస్ శాంతికుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలపై వరాలు కురిపించింది రాష్ట్ర ప్రభుత్వం. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు మంత్రి హరీశ్ రావు ఇప్పటికే ప్రకటించారు. సెర్ప్, మెప్మా మహిళలకు ఈ రుణాలు అందిస్తామన్నారు. మార్చి 8న రూ. 750 కోట్లు రుణాలు విడుదల చేస్తామని హరీశ్ రావు వెల్లడించారు.

మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 100 మహిళా ఆస్పత్రులు ప్రారంభమవుతాయని హరీశ్ రావు తెలిపారు. ముందుగా వంద ఆస్పత్రులు నిర్మించి క్రమంగా ఆస్పత్రులు పెంచతామన్నారు. ఆరోగ్య మహిళల పేరుతో ఈ ఆస్పత్రులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ప్రతి మంగళవారం ఆస్పత్రిలో మహిళా సిబ్బందే ఉంటారని పేర్కొన్నారు. తాజాగా, సంగారెడ్డి జిల్లాలో మహిళా సమైక్య దుకాణ సముదాయాల నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు భూమిపూజ చేశారు.
ఇది ఇలావుంటే, రాష్ట్రంలో ముఖ్య పట్టణాల్లో ఘనంగా మహిళా దినోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో మహిళల శక్తిని, పాత్రను గుర్తు చేసుకునేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. వివిధ హోదాలలో ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ప్రజాప్రతినిధులు, పురపాలక శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, వివిధ ఎన్జీవోల సిబ్బందితో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. మార్చి 8న మహిళా దినోత్సవం రోజు నుంచి ప్రారంభం అయ్యే ఈ వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలను మున్సిపల్ శాఖ నిర్వహించనుంది.












Click it and Unblock the Notifications