• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సడెన్‌గా ఢిల్లీకి బండి సంజయ్... అధిష్టానం పిలుపు... ఎందుకు పిలిచారు.. ఏం చర్చించబోతున్నారు?

|

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈ మేరకు గురువారం(డిసెంబర్ 31) సాయంత్రం సంజయ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. నూతన సంవత్సరానికి ఒకరోజు ముందు అధిష్టానం అకస్మాత్తుగా సంజయ్‌ని ఢిల్లీకి పిలిపించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి సంజయ్‌తో కేంద్రం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత టీఆర్ఎస్-బీజేపీ రాజకీయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గల్లీలో బీజేపీతో కుస్తీ పడుతున్న కేసీఆర్ ఢిల్లీలో మాత్రం ఆ పార్టీకి జై కొడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ పర్యటనకు ముందు కేంద్రంపై ఇక యుద్దమే అని ప్రకటించిన కేసీఆర్... ఆ తర్వాత పూర్తిగా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. గతంలో తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన వెనక్కి తీసుకున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా ఇటీవల వ్యవసాయంపై నిర్వహించిన సమీక్షలో గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామని చెప్పడం... దేశంలో ఎక్కడైనా పంటను అమ్ముకునేలా కేంద్రం చట్టాలు తెచ్చిందని ఈ సందర్భంగా ఉదహరించడం కేసీఆర్ పూర్తిగా యూటర్న్ తీసుకున్నారన్న వాదనకు ఊతమిచ్చింది.

telangana bjp chief bandi sanjay delhi tour to this night

మరోవైపు కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆయన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఢిల్లీ పెద్దల వద్ద వంగి వంగి దండాలు పెట్టినా సరే కేసీఆర్ జైలుకు వెళ్లడం తప్పదని పలుమార్లు హెచ్చరించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను కేసీఆర్ పరోక్షంగా సమర్థించడాన్ని స్వాగతిస్తూనే... కొనుగోలు కేంద్రాలను ఎత్తేయాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్లు సంజయ్ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత కొండగట్టు నుంచి బస్సు యాత్ర ప్రారంభించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. రాబోయే వరంగల్,ఖమ్మం కార్పోరేషన్ల ఎన్నికలతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ,నాగార్జునసాగర్ ఉపఎన్నికలోనూ విజయ పరంపరను కొనసాగించేలా బస్సు యాత్రను మొదలుపెట్టబోతున్నారు. తాజాగా సంజయ్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో... బస్సు యాత్రపై కీలకంగా చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంలో భాగంగా చేపడుతున్న ఈ యాత్రకు అధిష్టానం కీలక సూచనలు,వ్యూహాలు మార్గనిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంజయ్ ఢిల్లీ పర్యటన తర్వాత రాజకీయం మరింత రక్తి కట్టే అవకాశం ఉందంటున్నారు.

English summary
Telangana BJP chief Bandi Sanjay going to Delhi to this night as he got call from party high command.He might discuss about current political scenario in the state. After recent Delhi tour KCR took u turn over centre farm laws,and state BJP leaders often saying that cm will definitely go to jail as he did corruption in projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X