నా ఇల్లు.. మీ ఇల్లే అనుకోండి: రాహుల్ గాంధీకే ఆఫర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ/హైదరాబాద్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై అనర్హత వేటు పడిన అనంతరం దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అయ్యాయి. సైద్ధాంతికపరంగా కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకంగా భారత్ రాష్ట్ర సమితి వంటి పార్టీలు సైతం రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించాయి. వామపక్షాలు కూడా ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నాయి.
Rahul bhaiyya, Mera ghar…Aapka ghar.
— Revanth Reddy (@revanth_anumula) March 28, 2023
I welcome you to my home.
We are family, it is your home too. @RahulGandhi pic.twitter.com/Hps9Lu8S7a
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇంటిపేరు (Modi Surname)తో విమర్శించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ జైలు శిక్షను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సూరత్ న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది. జైలు శిక్ష పడిన నేపథ్యంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఈ), ప్రజా ప్రతినిధుల చట్టం 1951లోని సెక్షన్ 8 ఆధారంగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినట్లు వివరించింది.

అక్కడితో ఆగలేదు. లోక్‌సభ సభ్యుడిగా రాహుల్ గాంధీకి కేటాయించిన అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేయాలంటూ ఆదేశించింది. ఇదివరకే లోక్‌సభ సెక్రెటేరియట్ ఆయనకు నోటీసులను పంపించింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని నంబర్ 12, తుగ్లక్ లేన్‌లో తనకు కేటాయించిన అధికారిక బంగళాలో నివాసం ఉంటోన్నారు. అనర్హత వేటు పడటం వల్ల తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు రాహుల్ గాంధీ. దీనితో తక్షణమే ఈ బంగళాను ఖాళీ చేయాలంటూ ఆదేశించింది.
ఈ నోటీసుకు రాహుల్ గాంధీ ఇవ్వాళ సమాధానం ఇచ్చారు. బంగళాను ఖాళీ చేస్తానని, ఇందులో తనకు ఎలాంటి భేషజాలు లేవని తేల్చి చెప్పారు. నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యానని, ఇదే బంగళాలో నివసించానని గుర్తు చేశారు. ఈ బంగళాతో తనకు మధుర జ్ఞాపకాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన లోక్‌సభ సెక్రెటేరియట్ డిప్యూటీ సెక్రెటరీ డాక్టర్ మోహిత్ రాజన్‌కు బదులు ఇచ్చారు.

ఈ క్రమంలో- రాహుల్ గాంధీకి తన అధికారిక నివాసాన్ని ఆఫర్ చేశారు కాంగ్రెస్ పార్టీకే చెందిన మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి. ఆయనను తన నివాసానికి ఆహ్వానించారు. రాహుల్ భయ్యా.. నా ఇల్లు, మీ ఇల్లే అంటూ ట్వీట్ చేశారు. తన ఇంట్లో నివాసం ఉండాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. తాము అందరం ఒకే కుటుంబ సభ్యులమని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications