మహిళల కోసం కేసీఆర్ సర్కారు ఏం చేసిందంటే?: కేటీఆర్ చెప్పిన సమాధానం
హైదరాబాద్: మహిళల కోసం నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో ఫ్యూచర్ ఫార్వర్డ్ తెలంగాణలో భాగంగా ఉమెన్ ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. మహిళలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, అందుకే రాష్ట్రానికి చెందిన విద్యార్థినులు ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నారని చెప్పారు.

ఉమ్మడి కుటుంబాల్లో మహిళలది ప్రధాన పాత్ర. ఉమ్మడి కుటుంబంలోనే తన చిన్నతనం గడిచింది. నా జీవితంలో ఎంతోమంది స్ట్రాంగ్ ఉమెన్ లీడర్లను చూశాను. సానియా మీర్జా, సైనా నెహ్వాల్, నిఖత్ జరీన్ వంటి ఎంతో మంది మహిళలు హైదరాబాద్ నుంచి క్రీడల్లో రాణిస్తున్నారు. శ్రీనిధి వంటి కార్యక్రమాలు మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నాయన్నారు కేటీఆర్.
మహిళ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. సంపద సృష్టించాలని మహిళలు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. దీంతో చిన్న తరహా పరిశ్రమలు ప్రారంభించారు. మహిళల కోసం నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుచేశాం. దేశంలోనే తొలిసారిగా మహిళా ఎంట్రప్రెన్యూర్‌ల కోసం వి-హబ్‌లు ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు.
మ్యానిఫెస్టోలో లేకున్నా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను ప్రత్యేకంగా మహిళల కోసం ప్రారంభించామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో మహిళలు, గర్భిణులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. దీంతో సర్కారు దవాఖానల్లో డెలివరీల శాతం పెరిగింది. మైనార్టీల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేశాం. ప్రతి చిన్నారిపై రూ.10 వేలకుపైగా ఖర్చు చేస్తున్నాం. హైదరాబాద్‌ను మహిళలు సురక్షితంగా భావిస్తున్నారు అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications