తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం: రాష్ట్రంలో ఇక 24 గంటలపాటు షాపులు ఓపెన్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇక అన్ని వేళల్లో అంటే 24 గంటలపాటు దుకాణాలు(Shops) తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా 24/7 షాపులు తెరుచుకునేందుకు వీలు కల్పించింది. అయితే, 24 గంటలూ షాపులు తెరుచుకునేందుకు ఏడాదికి రూ. 10వేలు అదనంగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంతేగాక, ఉద్యోగులకు సంబంధించిన కీలక నిబంధనలు కూడా పేర్కొంది.

24 గంటలపాటు నిర్వహించే షాపుల యాజమాన్యం ఉద్యోగులకు సంబంధించిన పూర్తి రికార్డులు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇక మహిళా ఉద్యోగులకు వారి అనుమతితోనే నైట్ షిఫ్ట్ వేయాలని.. నైట్ షిప్టులలో పనిచేసే మహిళలకు వెహికిల్ పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్య కల్పించాలని, మహిళా సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని స్పష్టం చేసింది.
రాత్రి వేళలో పనిచేసే సిబ్బందికి విధిగా ఐడీ కార్డులు జారీ చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. లేబర్ చట్టాల ప్రకారం పని గంటలు నిర్ణయించాలని తెలిపింది. ఎక్కువ పని గంటలు పనిచేసిన వారికి ఓవర్ టైం డబ్బులు ఇవ్వాలని, వీకాఆఫ్ లతోపాటు పండగలకు సెలవులు ఇవ్వాలని సర్కారు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాత్రి వేళలో తెరిచే షాపులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications