కోకాపేట్, ఖానామెట్ భూమల వేలానికి హైకోర్టు ఓకే, కానీ.: విజయశాంతి స్పందన
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ప్రక్రియను ఆపేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల భూమిని గురువారం వేలం వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వేలం ఆపాలని కోరుతూ బీజేపీ నేత విజయశాంతి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
భూముల విక్రయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 13 కొట్టివేయాలని పిటిషన్లో విజయశాంతి కోరారు. అయితే, నిధుల సమీకరణతోపాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉన్నందున వేలం వేస్తున్నామని విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

భూములను ప్రభుత్వమే కాపాడుకోలేక అమ్ముకోవడమేంటని ఈ సందర్భంగా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూ బ్యాంక్ ఏర్పాటుపై పూర్తిస్థాయి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. అయితే, కోకాపేట, ఖానామెట్ భూమల వేలం ప్రక్రియను ఆపేందుకు హైకోర్టు నిరాకరించడంతో ప్రభుత్వానికి ఊరట కలిగినట్లయింది. దీంతో రేపు వేలం ప్రక్రియ జరుగనుంది.
కాగా, కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిబెట్టబోతున్నాయి. ఇక్కడ ఒక్కో ఎకరం ధర సుమారు రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ భూముల వేలంతో సర్కారుకు సుమారు రూ. 2500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) ఈ వేలం ప్రక్రియను చేపట్టనుంది.
హైకోర్టు రేపటి వేలానికి మాత్రమే అనుమతిచ్చిందని, జిల్లాల్లోని భూములను విక్రయించేందుకు కాదని బీజేపీ నేత విజయశాంతి తెలిపారు. ఆక్రమణకు గురవుతోన్న భూములు అమ్ముతున్నామని ప్రభుత్వ వాదనపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిందన్నారు. అయితే, రేపటి కోకాపేట, ఖనామెట్ వేలంకు మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చిందని.. 2015 హై కోర్టు ఆదేశాలతోనే రేపటి వేలానికి అనుమతి వచ్చిందని తెలిపారు. జిల్లాల్లో భూముల వేలానికి కోర్టు అనుమతి ఇవ్వలేదన్నారు. పూర్తి వాదనలు విన్న తర్వాత మాత్రమే తీర్పు ఇస్తామని కోర్టు చెప్పిందని.. హై కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం భూముల వేలం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు అమ్మే హక్కు ఎవరికీ లేదన్న విజయశాంతి.. పూర్తి తీర్పు వచ్చే దాకా భూములు ఎవరూ కొనవద్దు అని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications