డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యేలు..? నలుగురికి లింక్, ఆధారాల సేకరణ
బెంగళూరు డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఇందులో చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న బెంగళూరు పోలీసులు పూర్తిస్థాయిలో కూపీ లాగుతున్నారు. కొద్దీరోజుల క్రితం డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లను పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. వారిని విచారించగా కీలక విషయాలు వెలుగుచూశాయి.

తీగ లాగితే.. కదిలిన డొంక
బెంగళూరులో పబ్, హోటళ్లను నిర్వహిస్తున్న హైదరాబాద్ వ్యాపారవేత్తలు సందీప్, కలహర్ రెడ్డికు కన్నడ సినీ నిర్మాత శంకర్ గౌడ్‌కు డ్రగ్స్ సప్లై చేసినట్టు నైజీరియన్లు పోలీసుకు చెప్పారు. ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. సందీప్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అనేక విషయాలు బయటకు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు కలహార్ రెడ్డి పార్టీలు ఇచ్చేవాడని సందీప్ పోలీసులకు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.

నలుగురు ఎమ్మెల్యేలు..?
తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారని.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకున్నారని సందీప్ వెల్లడించాడని పేర్కొన్నారు. ఓ ఎమ్మెల్యే కోరిక మేరకు పలుమార్లు కొకైన్ పంపించానని సందీప్ అంగీకరించాడు. కలహర్ రెడ్డి, శంకర్ గౌడ్‌తోపాటు నలుగురు ఎమ్మెల్యేలను కూడా బెంగళూరు పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. వీరికి త్వరలో నోటీసులు జారీ చేస్తారు.

తనీష్ విచారణ
డ్రగ్స్ కేసులో నటుడు తనీష్‌ను బెంగళూరు పోలీసులు ఇప్పటికే పిలిచి ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పుడు ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ కేసుకు హైదరాబాద్‌తో ప్రధానంగా లింకులు కనిపిస్తుండటంతో బెంగళూరు పోలీసులు అరెస్టులకు కూడా సిద్ధమవుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే అరెస్ట్ కోసం బెంగళూరు పోలీసులు ఏర్పాట్లు ప్రారంభించినట్టు తెలుస్తోంది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరనే అంశంపై స్పష్టత ఉన్నప్పటికీ.. వారి అరెస్ట్‌కు మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

సినీ తారలతో పరిచయం
ఉద్యమకారుడినని చెప్పుకునే ఒక వ్యక్తికి తన వ్యాపారంలో భాగంగా సినిమా వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలు డ్రగ్స్ మార్కెట్‌లో పాలు పంచుకునేదాకా తీసుకెళ్లాయని తెలుస్తోంది. డ్రగ్స్ కేసును సీరియస్‌గా తీసుకున్న బెంగళూరు పోలీసులు... శాండల్ ఉడ్ లో సినీతారల్ని కూడా అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీగ లాగుతూంటే కేసు ఎక్కడెక్కడికో వెళ్తోంది. తాజాగా తెలంగాణ ఎమ్మెల్యేల పేర్లు వినపడటం సంచలనంగా మారింది. పూర్తి స్థాయి ఆధారాలు ఉండి.. ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తే రాజకీయాల్లో అది పెను సంచలనం అవనుంది.












Click it and Unblock the Notifications