పోలీసులమని చెప్పి.. బస్సులోంచి దించి, మహిళపై అత్యాచారం
సంగారెడ్డి: ఓ వైపు కొత్త చట్టాలు వస్తున్నప్పటికీ.. మహిళలపై జరుగుతున్న అఘాత్యాలు మాత్రం తగ్గడం లేదు. దోషులను పలు కేసుల్లో ఎన్‌కౌంటర్లు చేసినా.. నేరాలు చేసే వారు మాత్రం భయపడటం లేదు. తాజాగా, సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులమని చెప్పి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యపేటకు చెందిన మహిళ(37) తన 12ఏళ్ల కుమారుడితో కలిసి కర్ణాటకలోని బీదర్ నుంచి హైదరాబాద్‌కు బస్సులో వస్తోంది. ఈ క్రమంలో జహీరాబాద్ పస్తాపూర్ కూడలి వద్ద ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులమని చెప్పి.. ఆమె వద్దకు వచ్చారు. ఆమె లగేజీలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఉన్నాయని, తనిఖా చేయాలని ఆ మహిళను కిందికి దించారు.

తనిఖీ పేరుతో పాడుబడ్డ ఇంటికి తీసుకెళ్లి..
లగేజీని పరిశీలిస్తూ ఇద్దరు వ్యక్తులు మహిళ కుమారుడిని తమ వద్ద ఉంచుకోగా.. మరో వ్యక్తి మాట్లాడాలంటూ మహిళను సమీపంలోని ఎస్బీఐ బ్యాంక్ వెనుకబైపు ఉన్న పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడే తనపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని జహీరాబాద్ సీఐ సైదేశ్వర్, ఎస్ఐ వెంకటేశ్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

సీసీ ఫుటేజీలో నిందితుల గుర్తింపు..
కాగా, ఆ పాడుబడిన ఇంట్లో అత్యాచారానికి పాల్పడుతుండగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చారని.. దీంతో నిందితుడు అక్కడ్నుంచి పరారైనట్లు బాధితురాలు తెలిపింది. ఘటనపై అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బస్సు దిగిన సమయంలో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. నిందితులను ఆ ఫుటేజీలో గుర్తించారు. వారి కోసం ఇప్పటికే గాలింపు ప్రారంభించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications