యువకుల పైశాచికం: పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి, ఒకరు మృతి (వీడియో)
హైదరాబాద్ నగర శివారు నార్సింగిలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేసే కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ దాడిలో సంజయ్ అనే కార్మికుడు మృతి చెందాడు.
హైదరాబాద్: నగర శివారు నార్సింగిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెట్రోల్ బంకులో పనిచేసే కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ దాడిలో సంజయ్ అనే కార్మికుడు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సోమవారం అర్ధరాత్రి దాటాక నార్సింగి సమీపంలో జన్వాడలోని ఓ పెట్రోల్ బంకు వద్దకు కారు వచ్చి ఆగింది. పెట్రోల్ పోయాలని కారులోని యువకులు పెట్రోల్ బంకు సిబ్బందిని కోరారు. సమయం అయిపోయిందని.. పెట్రోల్ లేదని బంక్ లో పనిచేస్తున్న కార్మికులు తెలిపారు. చాలా దూరం వెళ్లాలని కారులో ఉన్న యువకులు చెప్పడంతో సిబ్బంది కనికరించి పెట్రోల్ పోశారు. బిల్లు చెల్లింపు చేసే సమయంలో యువకులు తమ కార్డును ఇచ్చారు.

అయితే, స్వైప్ మెషిన్ లేదని.. నగదు ఇవ్వాలని పెట్రోల్ బంక్ క్యాషియర్ కోరారు. దీంతో తమకే ఎదురు మాట్లాడతారా? అంటూ కారులో ఉన్న యువకులు రెచ్చిపోయి క్యాషియర్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో క్యాషియర్‌ను కొట్టొద్దంటూ సంజయ్ అనే కార్మికుడు అడ్డుపడ్డాడు. అడ్డుగా వచ్చిన సంజయ్ పైనా పిడిగుద్దులతో ఆ యువకులు విరుచుకుపడటంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత యువకులు కారులో పారిపోయారు.
A #fuel station employee beaten up by three youths, for asking to pay in #Cash, dies at Narsingi, #Hyderabad. @cyberabadpolice @cpcybd @TelanganaCOPs @DeccanChronicle @oratorgreat #CCTVFootage #payment pic.twitter.com/i49OgDomuq
— Pinto Deepak (@PintodeepakD) March 7, 2023
మిగిలిన కార్మికులు సంజయ్ ను వెంటనే ఆస్పత్రికి తరలించినా.. ప్రయోజనం లేకపోయింది. అప్పటికే సంజయ్ మరణించాడని వైద్యులు తెలిపారు. కాగా, పెట్రోల్ బంకులో జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సంజయ్ మృతితో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన నిందితులను జన్వాడ గ్రామానికి చెందిన నరేందర్, మల్లేశ్, అనూప్‌లుగా గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications