ఆత్మగౌరవ పోరాటం కాదు.. అస్తిత్వం కోసం ఆరాటం: వినయ్ భాస్కర్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేస్తున్నది ఆత్మగౌరవ పోరాటం కాదని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర అన్నారు. కేవలం అస్తిత్వం కోసం ఆరాటమేనని ఆయన విమర్శించారు. తన ఆస్తులను కాపాడుకోవడానికే బీజేపీలో చేరారని ఆరోపించారు. తెలంగాణ కోసం ఏమీ చేయని పార్టీలో ఈటల చేరడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని అభిప్రాయపడ్డారు.

వాడిపోయిన పువ్వు..
సీఎం కేసీఆర్‌ను కాదని వెళ్లిన వారు కనుమరుగు అయ్యారని.. గతాన్ని గుర్తు చేశారు. కమలం వాడిపోయిన పువ్వు అని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. బెంగాల్‌లో బీజేపీలోకి వెళ్లిన వారు తిరిగి తమ సొంత పార్టీలలోకి వెనక్కి వస్తున్నారని ఉదహరించారు. ఐదేళ్ల క్రితమే బీజేపీలో చేరడానికి ఈటల రాజేందర్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నారని ఆరోపించారు. ఐదేళ్ల క్రితమే కేసీఆర్‌తో గ్యాప్ వస్తే రెండేళ్ల క్రితం ఇచ్చిన మంత్రి పదవీని, రైతు బంధును ఎందుకు తీసుకున్నారని ఈటల రాజేందర్ ఆయన ప్రశ్నించారు.

కలిసి భోజనం చేసి..
కేసీఆర్ నియంత అయితే మాతో కలిసి ఎందుకు భోజనం చేస్తారని అడిగారు. ఈటల రాజేందర్ ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని తాము భావించామన్నారు. మా అందరికంటే ఎక్కువ పదవులను కేసీఆర్ ఇచ్చారని ఆయన తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకు బీజేపీలో చేరినవా అని ఈటలను ఆయన ప్రశ్నించారు. బీజేపీలో ఎందుకు చేరిండో ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తరుణ్ చుగ్ లాంటి వారు మండలానికో నేత వచ్చినా టీఆర్ఎస్ పునాదులను పెకిలించలేరన్నారు. టీఆర్ఎస్‌ను గద్దె దించుతామంటే ప్రజలు క్షమించరన్నారు.

కమల వికాసమే..?
టీఆర్ఎస్ పార్టీని వీడిన ఈటల రాజేందర్.. నిన్న బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అధికార పార్టీలో వివక్ష నెలకొందని.. తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఈటల రాజేందర్ అంటున్నారు. గత కొంతకాలం నుంచి పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో మంత్రివర్గం నుంచి తొలగించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే ఈటల.. తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపి.. ఆ పార్టీలో చేరారు. అయితే అక్కడ ఆయనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదనే సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి.












Click it and Unblock the Notifications